Take a fresh look at your lifestyle.

మరోసారి తెరపైకి కృష్ణాజలాల వివాదం

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నీటి విషయంలో తగాదాలే ఉండవనుకుంటున్న నేపథ్యంలో తాజాగా కృష్ణ నీటిపై చెలరేగుతున్న వివాదం గతాన్ని గుర్తుచేస్తున్నది. ఏపి సర్కార్‌ ‌కృష్ణా జలాలను తరలించేందుకు కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వ  డిమాండ్‌ను మరో రకంగా తిప్పికొట్టేందుకు ఏపి ప్రభుత్వం కౌంటర్‌ అటాక్‌ ‌మొదలుపెట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  ఇంతవరకు చేపట్టిన  కొత్త ప్రాజెక్టులన్నీ రాష్ట్రాల పునర్విభజన చట్టానికిలోబడి చేస్తున్నవి కాదంటూ వాటిని వెంటనే అడ్డుకోవాలని కృష్ణా, గోదావరి రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డులకు ఏపి ప్రభుత్వం లేఖ రాయడంతో ఇంతవరకు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహపూరిత, ప్రశాంత వాతావరణానికి గట్టి విఘాతమేర్పడినట్లైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కేఆర్‌ఎం‌బీ, సిడబ్ల్యుసీ, ఎపెక్స్ ‌కౌన్సిల్‌ల అనుమతులు పొందలేదన్నది ఏపి ప్రభుత్వ వాదన. ఏపి ప్రభుత్వం పోతిరెడ్డుపాడు వద్ద మరో కొత్త ప్రాజెక్టు చేపడితే తమ రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే ఆరోపిస్తున్నదో ఇప్పుడు ఏపి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపి ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందంటూ వాదిస్తోంది. రివర్‌ ‌బోర్డులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో అదే విషయాన్ని వివరించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 60రోజుల్లో 90 టిఎంసిల నీటిని వినియోగిస్తోందని, డిండి ప్రాజెక్టునుండి 60 రోజుల్లో 30 టిఎంసిల నీటిని తరలించేందుకు ఆరువేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని, అలాగే మరో మూడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని 77 నుండి 105 టిఎంసిలకు పెంచిందంటూ కృష్ణాబోర్డుకు చేసిన ఫిర్యాదులో ఏపి ప్రభుత్వం వివరించింది.
అదే విధంగా గోదావరి నుండి సుమారుగా 450 టిఎంసిల నీటిని వినియోగించుకునే దిశగా నిర్మిస్తున్న  ప్రాజెక్టులకు అపెక్స్ ‌కమిటీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నది ఏపి వాదన. పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి, ఎస్‌ఎల్‌బిసి, సీతారామ ప్రాజెక్టులు అలాంటివేనన్నది ఏపి సర్కార్‌ ‌వాదన.
పోతిరెడ్డిపాడు ఎత్తుపెంచుతూ ఏపి ప్రభుత్వం జీవో 203ను తీసుకురావడంతో మరోసారి తేనెతుట్టెను కదిలించినట్లైంది. దీనివల్ల హైదరాబాద్‌తోసహా మహబూబ్‌నగర్‌, ‌నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నీటికరువేర్పడే అవకాశముండడంతో తెలంగాణ సర్కార్‌ ‌దానిపై అభ్యంతరం చెప్పక తప్పలేదు. ఈ విషయంలో ఒక విధంగా ప్రతిపక్షాలే ముందుగా స్పందించాయి. జోడీ హమారీ అంటూ అలాయి బలాయిలు తీసుకుంటున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉండడం వల్లే కెసిఆర్‌ ‌వెంటనే స్పందించలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఏదైతేనేమి పోతిరెడ్డిపాడు ఎత్తును పెంచడం వల్ల తెలంగాణకు నీటి విషయంలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ సర్కార్‌ ‌కృష్ణాబోర్డుకు, అపెక్స్ ‌కమిటీలకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాగా తనను వివరణ కోరిన కృష్ణాబోర్డు ముందు ఏపి వాదన విచిత్రంగా ఉంది. న్యాయపరమైన హక్కు కన్నా మానవత్వంగా ఆలోచించాలంటోంది. పోతిరెడ్డిపాడు విస్తవరణ వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయంటూనే, తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలంటోంది. వాస్తవంగా శ్రీశైలంలో వరద జలాలు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీళ్ళిచ్చే పరిస్థితి. అయితే వరద జలాలు వృథాగా పోకుండా ఒడిసిపట్టుకునే పని తెలంగాణ చేస్తోంది. దీంతో తక్కువ కాలం తక్కువ నీటిని మాత్రమే వాడుకోవడమవుతున్నదని గ్రహించిన ఏపి 203 జీవోను తీసుకువచ్చింది.
ఈ జీవోను తెలంగాణలో అధికార పార్టీతోపాటు, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా జీవో పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఇంత కాలం ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారే వేడెక్కినట్లైంది. వారి అలింగనాలిప్పుడు ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. ఒక పక్క కత్తులు నూరుతూనే తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కెసిఆర్‌ ‌చెప్పుకురావడం ఓ విచిత్రపరిణామం. తామెప్పుడూ కలిసిమెలిసే ఉంటామని చెబుతున్న కెసిఆర్‌  ‌తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గే ప్రశ్నేలేదంటున్నారు. తనకన్నా నీటిగురించి అవగాహన ఎవరికుందంటున్న  కెసిఆర్‌  ఏపి దూకుడుకు చెక్‌పెట్టే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు దగ్గరలో మరో ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా మరిన్ని కృష్ణాజలాల వినియోగించుకోవడానికి ప్రణాళికను సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే పురమాయించినట్లు తెలుస్తున్నది. దీనివల్ల ఏపిని కట్టడిచేయవచ్చన్న కెసీఆర్‌ ఆలోచన. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అటు జగన్‌ ‌కూడా అంతే పట్టుదలలతో ఉన్నట్లు కనబడుతున్నది. చివరకు ఈ వివాదానికి ఎలా తెరపడుతుందన్న ఆసక్తి ఇప్పుడు ఇరురాష్ట్రాల్లో నెలకొంది.

Leave a Reply