రాజ్య సభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఎంపీలకు కొరోనా వైరస్ సోకుతుందేమో అనే భయం కారణంగా రాజ్యసభను బుధవారం నిరవధికంగా వాయిదా వేశారు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు. ప్రతిపక్షాలు సభను బహిష్కరించి బయట ఉండగా, రాజ్య సభ ఈ రోజు విదేశీ సహకారం(నియంత్రణ) సవరణ బిల్లు, 2020, ద్విపాక్షిక నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ కాంట్రాక్టస్ బిల్లు, 2020, మూడు లేబర్ కోడ్ బిల్లులు, జమ్మూ కాశ్మీర్ అధికారిక భాష బిల్లును అధికారపక్షం బలం లేని రాజ్య సభ ఆమోదించింది. వారం పాటు జరిగిన సమావేశాల్లో ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్యసభ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉండగా కేవలం 10 సిట్టింగ్‌లలో, 25 బిల్లులను రాజ్య సభ ఆమోదించింది. మరో 6 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఈ సెషన్లో ప్రతిపక్షాలు తమ నోరు నొక్కేస్తున్నారని ఆందోళన చేయటం మూలంగా 3.15 గంటలు ప్రతిపక్ష పోరాట కాలంగా నిలిచింది.
సభ మొత్తం సమయంలో కేవలం 57% సమయం మాత్రమే ప్రభుత్వ లెజిస్లేటివ్ బిజినెస్ కోసం ఉపయోగపడింది. వివిధ ప్రతిపక్ష పార్టీలు, ఇటీవల ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిశ్శబ్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు మహాత్మా గాంధీ విగ్రహం నుండి పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ చేస్తూ ‘‘రైతులను రక్షించండి, కార్మికులను రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’’ వంటి సందేశాలతో ప్లకార్డులు చేపట్టి నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్, టిఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ-ఎం, డిఎంకె, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జెడి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్ వాదీ పార్టీ, ఎన్‌సిపి సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి లేఖ రాసి వివాదాస్పద బిల్లులపై సంతకం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లులు వోట్ల విభజన లేకుండా మూజువాణి వోటుతో ఆమోదించబడ్డాయనే విషయాన్ని ప్రతిపక్షాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లాయి.
ప్రతిపక్షాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కలిసే అవకాశం ఉంది. దేశ కార్మికుల తల రాతను మార్చే మూడు లేబర్ కోడ్ బిల్లులు ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లు 2020, సోషల్ సెక్యూరిటీ బిల్లు, 2020 మూడు లేబర్ కోడ్ బిల్లులను రాజ్యసభ క్లియర్ చేసింది. బిల్లును ప్రవేశపెట్టిన కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రభుత్వం చేపడుతున్న ఈ మూడు సంస్కరణలు ‘‘కార్మికుల సంక్షేమానికి మైలురాయి’’ అవుతాయి అని ప్రకటించారు. ఈ సంస్కరణల వలన పరిణామాలను పరిశీలిస్తే పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లు 2020లో, కార్మికుల సమ్మెకు హక్కులను పరిమితం చేసే మరిన్ని షరతులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 100 మంది కార్మికుల నుండి 300 మంది కార్మికులు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను కలిగి ఉన్న పారిశ్రామిక సంస్థలలో కార్మికులను తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఈ నియమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా చేయటం వలన పరిశ్రమల యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నామని ప్రభుత్వమే చెప్పింది.