ఏమీ లేదు
ఇంకోసారి చెబుతున్నా
జాగ్రత్తగా విను.
నేను చెప్పేదీ,
నీవు వినేదీ ఒకటే కావాలి.
భిన్నంగా ఆలోచించడానికి
ఇంకేదైనా ఉంటే నీ ఇష్టం.
ఈ రాజ్యంలో భూతమే ఉంది,
భవిష్యత్తు లేదు.
అందుకే …
ముందుగా మనసును చంపేసా,
సమయాన్నీ చంపేస్తూ
ఓడిపోవడం బాగా నేర్చుకున్నా.
తుఫాన్లను ఎదుర్కోవడం,
సర్దుకుపోవడం
బాగా అలవాటైన నేను
నిస్సహాయత నుంచి,
నిస్సహాయతలోకి
కుంటి నడక నడవొచ్చుగానీ
నాకది ఇష్టం లేదు,
ఎందుకంటే
భావమైనా,బావి అయినా
మెట్టు,మెట్టుగా దిగుతూ,
ఎక్కడం నాకిష్టం.
అందుకే ఏమి జరిగినా
బురదలో కూరుకుపోయిన చెప్పుల్లా
కదలక, మెదలక
నిస్సహాయంగా చూస్తూనే ఉన్నా.
ఏదో ఒక రోజు
ఒక్కొక్కరుగా రాకపోరు,
నాతో కలవకపోరు.
వేమూరి శ్రీనివాస్
9912128967,
తాడేపల్లిగూడెం