- గ్రేటర్‌లో స్వీయ నియంత్రణ పాటిస్తున్న వ్యాపారులు
- కొరోనా కట్టడికి సామూహికంగా వ్యాపార సంస్థలు బంద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొరోనా మహమ్మారి కోరలు చాస్తుండటం నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొరోనా ప్రభావం ప్రారంభమైన కొత్తలో ప్రభుత్వం వైరస్ నియంత్రణపై అవగాహన కలిగించడం, ప్రజలు బయటికి రాకుండా కట్టడి చేయడానికి చర్యలు చేపట్టింది. అయితే, కొరోనా ప్రభావం అంతకంతకూ పెరిగి ఇక దీంతో కలసి సహజీవనం చేయాల్సిందే అని పరిస్థితికి రావడంతో ప్రజలు కూడా ఎవరికి వారే మానసికంగా స్వీయ నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలను నిత్యకృత్యం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తగ్గిందని భావించిన కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు స్థాయికి చేరుకుంది. వారం రోజుల క్రితం వరకూ నగరంలో పదుల సంఖ్యలో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు మూడు వందలకు తగ్గడం లేదు. గత వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో నమోదైన కొరోనా కేసుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే…ఈనెల 18న తొలి సారిగా తెలంగాణ రాష్ట్రంలో 352 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 302 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 27, మేడ్చల్ జిల్లా పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి.
ఆ తరువాత నుంచి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో కొరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత రెండు రోజుల పాటు కొరోనా కేసుల ఉధృతి కొంత మేర తగ్గింది. ఆ తరువాతి రోజు మొత్తం 546 కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 459 కేసులు, రంగారెడ్డిలో 129, మేడ్చల్‌లో 79 కొత్త కేసులు నమోదు కావడం నగర జీవి వెన్నులో వణుకు పుట్టించింది. తాజాగా బుధవారం ఆ సంఖ్య 891కి చేరింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ 719, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 55 కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ అదే స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కొరోనా తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం కూడా ఇక ఈ వైరస్ నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టం చేసింది. దీంతో నగర ప్రజలతో పాటు వ్యాపారులు కూడా కొరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా నగరంలోని అధిక జనసమ్మర్థ వ్యాపార, వాణిజ్య •సముదాయాలు అధిక సంఖ్యలో ఉన్న పాత నగరంలోని బేగంబజార్, మలక్‌పేట, చార్మినార్‌తో పాటు సికింద్రాబాద్, జనరల్ బజార్, ప్యారడైజ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలు వస్తుంటారు. ఈ ప్రాంతాలలో ఎక్కడా ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదనీ, ఇక్కడికి వచ్చిన వారిలో పాజిటివ్ ఉన్న వారి ద్వారా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వైరస్ విస్తరిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో హోల్ సేల్, రిటైల్ కిరాణా దుకాణాలు అధికంగా ఉన్న బేగం బజార్ మార్కెట్‌ను ఈనెల 28 నుంచి జూలై 5 వరకూ వారం రోజుల పాటు స్వచ్చందంగా మూసివేయాలని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే, వస్త్ర వ్యాపారానికి సంబంధించిన దుకాణాలు అధికంగా ఉన్న సికింద్రాబాద్, జనరల్ బజార్, ప్యారడైజ్ ప్రాంతాల వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నారు. జీవనోపాధికి వ్యాపారం లేకున్నా ఎలాగోలా నెట్టుకురావొచ్చు కానీ, కొరోనా మహమ్మారి బారిన పడితే అసలు ప్రాణానికి ఎసరు వస్తుందన్న భావనతో కొరోనా ప్రభావం తగ్గే వరకూ ఇంట్లోనే కూర్చోవాలన్న కృతనిశ్చయానికి వ్యాపారులు వచ్చారు. కొరోనా చికిత్సలకు రోజుకు కనీసం రూ. 2 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి రావడం కూడా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొరోనా కేసులు ప్రతీ రోజూ 700 నుంచి 800 దాకా నమోదవుతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందించడానికి దవాఖానలు కూడా సరిపోవడం లేదు. ప్రభుత్వం కొరోనా పరీక్షలు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వైద్య చికిత్సలు అందించడానికి ప్రైవేటు ఆసుపత్రులను సైతం అనుమతించడంతో కార్పొరేట్ దవాఖానలు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దవాఖానల యాజమాన్యాలు బెడ్లను కేటాయించడానికి రిజర్వేషన్ పద్దతిని పాటిస్తుండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. మరోవైపు, రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటాన్ని బట్టి చూస్తే ఇది సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రె)• దశకు చేరిందా అని వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దశకు చేరినప్పుడు మాత్రమే ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
బేగంబజార్‌లో వ్యాపారాలు బంద్
మర్చంట్స్ అసోసియేషన్ నిర్ణయం
సికింద్రాబాద్ వ్యాపారుల దారిలో బేగంబజార్ వ్యాపారులు కూడా బంద్‌కు సిద్దం అయ్యారు. కరోనా కేసులు పెరగడంతో వ్యాపార లావాదేవీనలు 30 వరకు నిర్వహించరాదని నిర్ణయించారు. హైదరాబాద్కరోనా వైరస్ రోజు రోజుకు విజృంబిస్తునే వుంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా వుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 10వేలు దాటాయి. ఇప్పటి వరకు 4,361 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 5,855 యాక్టీవ్ కేసులున్నాయి. కేసుల పెరుగుదలతో సర్కార్ అప్రమత్తమయ్యింది. గచ్చిబౌలి టిమ్స్‌లో త్వరలోనే కరోనాకు చికిత్స ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఆస్పత్రిలో అన్ని సిద్ధంగా ఉంచామని తెల్పింది. కొత్తగా నమోదువుతున్న కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ంఎంసీ పరిధిలోనివే. దీంతో బేగం బజార్ మర్చంట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం 28 నుంచి వచ్చే ఆదివారం వరకు మూసి వేస్తున్నట్టు కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.