Take a fresh look at your lifestyle.

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి  ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హుజురాబాద్ పట్టణంలో రవిశంకర్ శుక్లా, ఒంటెల రమణారెడ్డి, విప్లవ్ దత్ శుక్లాల ఆధ్వర్యంలో స్థాపించిన విశ్వప్రగతి స్కూల్ లో కొద్దికాలం హాస్టల్ వార్డెన్ గా పనిచేసారు.  ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. (పొలిటికల్ సైన్స్) పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికైనారు. 1999 నుండి 2002 వరకు అశోక్ రెడ్డి  వరంగల్ జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2002 నుండి 2004 వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా పనిచేసిన అశోక్ రెడ్డి  2004 నుండి 2006 వరకు సర్వశిక్ష అభియాన్ (డిపిఈపి) ప్రాజెక్ట్ అధికారిగా విధులను నిర్వర్తించారు.
డా.రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి గా ఉన్నకాలంలో అశోక్ రెడ్డి  పనితీరును గమనించిన ముఖ్యమంత్రి తమ స్వంత జిల్లా కడప లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆయనను నియమించడం జరిగింది.అశోక్ రెడ్డి  కడపలో 2006 నుండి 2009 వరకు పనిచేశారు. 2009 నుండి 2011 వరకు ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై స్కీమ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. 2011 నుండి 2012 వరకు రంగారెడ్డి జిల్లా సహాకార అధికారిగా, 2012 నుండి 2014  వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో అదనపు కమిషనర్ గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ తొలి మంత్రి వర్గం లోని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు   ప్రైవేట్ కార్యదర్శిగా 2014 నుండి 2018 వరకు పనిచేశారు. 2019 లో తొమ్మిది నెలల పాటు మూసినది నీటి అభివృద్ధి సంస్థ మానేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. 2019 నుండి ఇప్పటివరకు అశోక్ రెడ్డి  రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు  ప్రైవేట్  కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పరిపాలన అనుభవంతో పాటు క్రమశిక్షణతో, నిబద్ధతతో బాధ్యతలను నిర్వహించే అధికారిగా ఆయనకు పేరుంది.

Leave a Reply