Take a fresh look at your lifestyle.

కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

“కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ ప్రాంత ప్రజలు బాపూజీ గా పిలుచుకునే కొండాలక్ష్మణ్‌ ఒకటి, రెండు కాదు.. అన్నిరంగాలలో కృషిచేసారు. ఎన్ని విజయాలు రుచిచాసారో, అంతకుమించి అపజయాలు అనుభవించారు. దొడ్డిదారిన కాకుండా వ్యవస్థ కోసం తెలంగాణ సహకారం కోసం ప్రాధాన్యతనిచ్చి అనేక సార్లు ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకున్నారు.”

కొందరు తమ కోసమే బ్రతికితే మరికొందరు ప్రజల కోసం వ్యవస్థ కోసం బ్రతుకుతారు. రెండవ కోవకు చెందిన వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి కొండంత అండ తెలంగాణ ఆత్మగౌరవ పతాక కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ. తెలంగాణ ప్రాంత ప్రజలు బాపూజీ గా పిలుచుకునే కొండాలక్ష్మణ్‌ ఒకటి, రెండు కాదు.. అన్నిరంగాలలో కృషిచేసారు. ఎన్ని విజయాలు రుచిచాసారో, అంతకుమించి అపజయాలు అనుభవించారు. దొడ్డిదారిన కాకుండా వ్యవస్థ కోసం తెలంగాణ సహకారం కోసం ప్రాధాన్యతనిచ్చి అనేక సార్లు ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుండి యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆశించారు. ముఠా రాజకీయాలు, కులవివక్ష పెరిగి బీసీ వర్గాలు ఎదగక పోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన కోరుకున్నారు. దళిత సంఘాల రిజిస్ట్రేషన్లు, రిజర్వేషన్లు, కులాల వృత్తి సహకార సంఘాలకు సబ్సిడీలు, రాయితీలు, చేనేత అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ వర్గాలకు అండగా నిలిచారు. బహుజనులు సాధికారత సాధించాలంటే విద్యఒక్కటే మార్గమని తలచి పద్మశాలీల తోపాటు అనేక కులాల వారికి హాస్టల్‌ ‌సౌకర్యాలను సమకూర్చడంలో కృషి చేశారు.

స్వాతంత్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షులుగా నిజాయితీగా వ్యవహరించారు. నిజాముకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు కేసుని పరిష్కరించారు. కొడుకు ను పాకిస్తాన్‌ ‌పైయుద్ధం లోకి పంపారు. భార్య డాక్టర్‌ ‌గా యుద్ధంలో క్షతగాత్రులకు సేవలందించారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ మండల్‌ ‌కమిషన్‌ ‌సిఫారసులను వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొండా లక్ష్మణ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. 1977 ఎన్నికల్లో శాసన సభ్యునిగా గెలిచి మంత్రి పదవి దక్కిన ప్పటికీ ఉమ్మడి రాష్ట్ర పాలనను వ్యతిరేకించారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కోసం 1969 మార్చి 27న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ ‌చేసింది. లక్ష్మణ్‌ ఆదిలాబాద్‌ ‌జిల్లా వాంకిడి లో 1915 సెప్టెంబర్‌ 27‌వ తేదీన మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న తనంలోనే పోరాట దృక్పథం అలవడింది. విద్యార్థిదశలో మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. 1930 లో మహారాష్ట్ర పరిధిలోని రాజురా గ్రామానికి గాంధీ వస్తున్నట్లు తెలిసి అక్కడికి 15 మైళ్ళు నడిచారు. గాంధీని కలిసి ఆయన వెంట తిరిగి టోపీ ధరించి నందుకు నిజాం సైనికులు అరెస్టు చేసి హెచ్చరించి వదిలారు.

1938లో హైదరాబాద్‌ ‌లో జరిగిన పౌర ఉద్యమం, మహాసభల్లో పాల్గొని అరెస్టయ్యారు. 1940లో ఆంధ్రమహాసభ ద్వారా ఖద్దరు చేనేత వస్త్రాల ప్రచారం చేపట్టారు. వందేమాతర ఉద్యమం తో పాటు 1942లో క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో కోఠీలోని బ్రిటిష్‌ ‌రెసిడెన్సీ పై జెండా ఎగురవేసి సత్తా చాటు కున్నారు. చాకలి ఐలమ్మ తదితరులపై కుట్రకేసులలో ఉచితంగా కేసును వాదించి నిర్బంధం నుండి విముక్తి కల్పించారు. తెలంగాణ ఉద్యమం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వారికి మద్దతుగా న్యాయ సహాయం ఉచితంగా అందించారు. 1952 నాటికి కాంగ్రెస్‌ ‌పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తొలి సాధారణ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ ‌నుంచి, 1957లో నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నుంచి ఎన్నికై శాసనసభ ఉపసభాపతి గా 1960 వరకు పదవిలో కొనసాగారు. 67 లో భువనగిరి నుంచి ఎన్నికై మంత్రిగా పదవి పొందినప్పటికీ తెలంగాణ కోసం రాజీనామా చేసారు. 1972లో తిరిగి భువనగిరి నుంచి గెలిచి నప్పుడు కాంగ్రెస్‌ ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి రెండుసార్లు పరిశీలించినప్పటికీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కంటే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని కేంద్రానికి చెప్పి ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారు. మంత్రిగా వెనుకబడిన వర్గాలకు ఎంతో అండగా ఉన్నారు. 1953లో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల చేతివృత్తుల కమిటీ నియమించినప్పుడు కొండా లక్ష్మణ్‌ ‌రాష్ట్రంలోని బీసీలను స్థితిగతులపై నివేదిక సమర్పించారు. సేవా దృక్పథం, ఉద్యమ ప్రస్థానాన్ని, రాజకీయ జీవిత ప్రజా ఉద్యమాన్ని పేర్కొనేందుకు మాటలు చాలవు. సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే. 1961 లో మూసీ నదికి వరదలు వచ్చిన ప్పుడు నల్లగొండ జిల్లాలో 220 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు.

చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆకలిచావులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు..
96 ఏళ్ల వయస్సులో ఆయన ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసారు. తెలంగాణ సాకారం కాకముందే 2012 సెప్టెంబర్‌ 21‌న తనువు చాలించారు. ఆయన మరణానంతరం శత జయంతిని 2015 లో అధికారికంగా నిర్వహించారు. జయంతి వర్ధంతి లను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ హార్టికల్చర్‌ ‌విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమే. ఆయన స్మృతి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు పాల్గొని నివాళి అర్పించి, ఆయన స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాకారం చేయడానికి కృషి చేయావి.

వడ్డేపల్లి మల్లేశము, 9014206412 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్‌ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి, హుస్నాబాద్‌ ‌జిల్లా సిద్దిపేట.)

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply