
డోలువాయిద్యాలు మార్మోగంగా… కొమ్ము బూరలు ఊదంగా.. శివసత్తుల పూనకాలు… ఆడబిడ్డలంతా వరం పట్టంగా అడవితల్లి పరవశించంగా.. అమ్మల కన్న అమ్మ సమ్మక్క గద్దెకు చేరుకోవడంతో జాతరలో మరో అద్భుతఘట్టం ఆవిష్కతమైంది. సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్యతో పాటు వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆవహించిన కుంకుమ భరణి తీసుకువచ్చేందుకు బయలుదేరి అక్కడ పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు ఆహ్వానం పలికారు.
భరిణి రూపంలో సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తుండగా భక్తులు ఎదురేగి స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో తొక్కీసలాట జరుగకుండా పోలీసులు భారీ పటిష్టతల చర్యలు చేపట్టారు. అయినప్పటికీ చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన పూజారి తీసుకరావడం కనిపించగానే ఒక్కసారిగా భక్తులు పారవశ్యానికి చెంది దండాలమ్మ.. దండాలంటూ.. సమ్మక్కకు మొక్కుతూ చిలుకల గుట్ట నుంచి గద్దెల వరకు చేరుకున్నారు.