Take a fresh look at your lifestyle.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి వార్షిక సాల‌క‌ట్ల‌ బ్ర‌హ్మోత్స‌వాలు, అధిక‌మాసం కార‌ణంగా అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వరకు న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లన్ని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని తీర్మానించిన‌ట్లు వివ‌రించారు. ఇందుకోసం జీయ్య‌ర్ స్వాములు, ఆగ‌మ స‌ల‌హాదారులు, ప్ర‌ధాన అర్చ‌కుల‌తో చ‌ర్చించి సాంప్ర‌ధాయ బ‌ద్ధంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలియ‌జేశారు.

Koil‌ Alwar Thirumanjanam Astotharam in Srivaari temple Tirumala

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఏప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకుని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ప్ర‌తి రోజు దాదాపు 12 వేల మంది భ‌క్తులు సంతృప్తి క‌రంగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటున్నార‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా ఆల‌యంలో ఏకాంతంగా జ‌రిగే వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా అందించ‌నున్న‌ట్లు తెలిపారు.
కాగా బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సెప్టెంబ‌రు 23వ తేదీ సాయంత్రం గ‌రుడ‌సేవ నాడు రాష్ట్ర ప్రభుత్వం త‌రుపున ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్టు వ‌స్త్ర‌లు స‌మ‌ర్పిస్తార‌న్నారు. ‌

ప్ర‌తి ఏడాది సంవ‌త్స‌రానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

Koil‌ Alwar Thirumanjanam Astotharam in Srivaari temple Tirumala

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఎస్వీబీసీ సిఈవో సురేష్ పాల్గొన్నారు.

Leave a Reply