Take a fresh look at your lifestyle.

నేడు పండుగలా.. కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

  • కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్‌ ‌దంపతుల ప్రత్యేక పూజలు
  • సీఎం రాకతోనైనా ఆలయం దిశ మారేనా?

ప్రపంచ ఇంజనీరింగ్‌ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుతున్న కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ ‌మండలం లోని పాములపర్తి శివారులో నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు శుక్రవారం ప్రారంభం కానున్నది. ప్రాజెక్టు ప్రారంభం కానున్న సందర్భంలో జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం ఉదయం పూటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగంతో పాటు ప్రత్యేకంగా గంగమ్మ పూజలు చేయనున్నారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సిఎం కేసీఆర్‌ ‌దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. పూజల అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎర్రవల్లి, మర్కూక్‌లో నిర్మించే రైతు వేదికలకు సిఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేసిన అనంతరం కొండపోచమ్మ పంజ్‌హౌస్‌కు చేరుకుని చినజీయర్‌స్వామికి స్వాగతం పలికి సుదర్శన యాగం, పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో పంప్‌హౌస్‌ ‌స్విచ్చాన్‌ ‌చేస్తారు. ఇదిలా ఉంటే, కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల సందర్భంగా భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నీ తానై చేస్తున్నారు.

కేసీఆర్‌ ‌రాకతోనైనా కొండపోచమ్మ ఆలయం దిశ మారేనా?
తీగుల్‌నర్సాపూర్‌ ‌గ్రామ శివారులో వెలిసిన శ్రీ కొండపోచమ్మ ఆలయం భక్తుల కొంగు బంగారంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ప్రతియేటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి కొండపోచమ్మను దర్శించుకుంటుంటారు. పోచమ్మను ఆడబిడ్డగా భావించే భక్తులు ఒడి బియ్యం పోస్తారు. కొమురవెళ్లి మల్లన్న దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడూ కొండపోచమ్మను దర్శించుకుంటుంటారు. ఎంతో మహిమ గల దేవతగా పిలువబడుతున్న కొండపోచమ్మ ఆలయం అభివృద్ధి మాత్రం అంతంతగానే ఉంది. ఆలయానికి ఆదాయం అంతో ఇంతో వస్తున్నప్పటికీ…ఆలయం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పాలి. ఆలయానికి కేవంల ఒక్కటంటే ఒక ఎకరమే స్థలం ఉంది. వచ్చే ఆదాయమంతా ప్రయివేట్‌ ‌వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుంది. ఆలయం వద్ద ఉన్న చెరువు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. లక్షలాది మంది వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు కూడా లేవు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని మర్కూక్‌ ‌ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్‌కు సిఎం కేసీఆర్‌ ‌కొండపోచమ్మ పేరును పెట్టారు. ఈ ప్రాజెక్టు అనతి కాలంలోనే పూర్తి చేసుకుంది. ప్రారంభోత్సవం సందర్బంగా కొండపోచమ్మ ఆలయం వద్ద సిఎం కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేసేందుకు రానున్నారు. సిఎం కేసీఆర్‌ ‌రాక సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కొండపోచమ్మ ఆలయం వద్దకు సిఎం కేసీఆర్‌ ‌వస్తుండటంతో ఇప్పటికైనా ఆలయం దిశ మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. చూడాలి మరి!.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!