Take a fresh look at your lifestyle.

నియంత్రణలో నిర్లక్ష్య వైఖరి ..!

  • ప్రణాళికాబద్ధంగా కట్టడి చేసి లాక్‌డౌన్‌ ఎత్తివేయాలి
  • టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌డిమాండ్‌

‌రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో అనుసరిస్తున్న విధానాల వల్ల తలెత్తే పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలు దాదాపు నిలచిపోయాయనీ, ఏప్రిల్‌ 27‌న ప్రభుత్వం కేవలం 103 పరీక్షలు మాత్రమే చేసిందని పేర్కొన్నారు. ఓవైపు దేశంలోని ఇతర రాష్ట్రాలు రోజులు వేల సంఖ్యలో పరీక్షలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా పరీక్షలు చేసి దులుపుకుంటున్నదని అభిప్రాయపడ్డారు. కేసులపై వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చి సీఎం అంతా బాగుంది అని ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. 1000కి పైగా పాజిటివ్‌ ‌కేసులు ఉండి ప్రతీ రోజూ అతి తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. సంక్రమణ శాతంలో కూడా తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదనీ, ప్రతీ పది లక్షల జనాభాకు తెలంగాణ చేస్తున్న పరీక్షలు కేవలం 468 మాత్రమేనని గుర్తు చేశారు. ఈ విధంగా చూసినా ఇది దేశంలో 14వ స్థానంలో ఉన్నట్లని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరోనా పరీక్షలపై అనుసరిస్తున్న వైఖరి ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నదనీ, పాజిటివ్‌ ‌కేసులు లేనే లేవన్నట్లు ప్రపంచాన్ని భ్రమింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఆసుపత్రులలో చనిపోయిన వ్యక్తులకు, కొరోనా పాజిటివ్‌ ‌వ్యక్తుల సెకండరీ కాంటాక్టులకు కోరోనా పరీక్షలు నిర్వహించవద్దని ఆదేశాలివ్వడం స్పష్టంగా వాస్తవ పరిస్థితుల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యగా ప్రొ.కోదండరామ్‌ అభివర్ణించారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు వైఖరితో రాష్ట్రంలో కొరోనా మూడో దశకు చేరుకున్నదనీ, ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే కొరోనా వ్యాప్తిలో కేసులు విస్పోటనంలా మారడానికి ఎంతో సమయం పట్టదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు కేసులే లేవన్న సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో 83 కేసులు వచ్చాయనీ, ప్రభుత్వం స్పందించి మరింత విస్త•తంగా పరీక్షలు నిర్వహించే బదులు అసలు ఆ జిల్లాలో పరీక్షలే నిలిపివేసిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అసాధ్యంగా మారుతున్నదనీ, వైరస్‌ ‌కట్టడికి ఎలాంటి ప్రణాళిక, వ్యూహం లేకుండా లాక్‌డౌన్‌ను కొనసాగించడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆడుకోవడమేననీ, భవిష్యత్తులో లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పుడు ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుందనీ, ముఖ్యంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కోరోనా నియంత్రణకు స్ఫష్టమైన వ్యూహాన్ని అనుసరించాలనీ, పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలనీ, కొరోనాను ప్రణాళికాబద్ధంగా కట్టడి చేస్తూ దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!