- స్కూళ్లలో ఉండాల్సిన వారిని స్టేషన్లో నిర్బంధిస్తారా
- టీచర్ల మహాధర్నాలో కోదండరామ్ విమర్శ
- టీచర్లకు మద్దతుగా నేతల ఆందోళన
ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని ఆరేళ్లయినా టీచర్ల సమస్యలు పరిస్కారం కాకపోవడం దారుణమని పలువురు నేతలు మండిపడ్డారు. వీరి సమస్యలను పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యానికి గురి చేయడం దారుణమని అన్నారు. సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్కు వద్ద టీచర్లు మంగళవారం ధర్నా తలపెట్టారు. ఈ ధర్నాకు వొస్తున్న టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవని.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. టీచర్ల అరెస్ట్‌ను కోదండరామ్ ఖండించారు. క్లాస్ రూంలో ఉండాల్సిన టీచర్.. పోలీస్ స్టేషన్లో ఉండడమంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా దాదాపుగా 25 వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. పదోన్నతులు వెంటనే కల్పించాలని చెప్పారు. పీఆర్సీను వెంటనే అమలు చేయాలని కోరారు.
పీఆర్సీ విషయంలో 2018 నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ఎగ్గొట్టే అవకాశం ఉందని ఆరోపించారు. సీపీఎస్ రద్దు చెయ్యాలి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కోపమే రాని టీచర్లకు ఎసరు పెడుతున్నావ్ కేసీఆర్.. నీ కుర్చీకే ప్రమాదం ఉందని కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీచర్స్ మహాధర్నా అనేది ప్రభుత్వానికి ఓ హెచ్చరిక అని మాజీ రాజ్యసభ సభ్యులు, సీపీఐ నాయకులు అజీజ్ పాషా పేర్కొన్నారు. పీఆర్సీ.. బదిలీలు.. ఖాళీలపై ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదన్నారు. ఎడ్యుకేషన్‌కు సౌత్ ఇండియాలోనే అతి తక్కువ బ్జడెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అక్షరాస్యతను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సీపీఐ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అజీజ్ పాషా వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన సీఎం కేసీఆర్ టీచర్లకు పిఆర్సి ఎందుకు ఇవ్వడం లేదని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా40 వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను మరిచి పోయి బార్లు వైన్స్ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టాడన్నారు. ప్రభుత్వ పాఠశాల్లాలో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. టీచర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. భవిష్యత్తులో టీచర్లు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్ష వర్ధన్ రెడ్డి అన్నారు. అరున్నర ఏళ్లుగా ఉపాధ్యాయులు సమస్యలపై సీఎం కేసీఆర్ ఒక్కసారి సక్ష చేయలేదన్నారు. తెలంగాణ వొస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్న టీచర్లు ఇప్పుడు సమస్యల కోసం పోరాడాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.