Take a fresh look at your lifestyle.

ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ… గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరామ్‌

అధికారికంగా ప్రకటించిన టీజేఎస్‌

‌త్వరలో జరుగనున్న ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొ.కోదండరామ్‌ ‌పోటీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గంగారపు వెంకటరెడ్డి ప్రొ.కోదండరామ్‌ ‌పేరును టీజేఎస్‌ ‌గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీలో విస్తృతంగా చర్చించిన మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రొ.పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ‌హయాంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని విమర్శించారు.

సీఎం ఎవరికీ అందుబాటులో ఉండరనీ, ఎప్పుడు ప్రగతి భవన్‌లో ఉంటారో ఎప్పుడు ఫాం హౌస్‌లో ఉంటారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని యువత, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు. టీజేఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగారపు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రొ.కోదండరామ్‌ ‌గెలుపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రొ.కోదండరామ్‌ ఈ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రంలో తెలంగాణవాదులకు తిరిగి బలం చేకూరుతుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు తదితర వర్గాలంతా కోదండరామ్‌ ‌గెలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. చట్టసభలలో ప్రశ్నించే గొంతుక కావాలని, అది కోదండరామ్‌ ‌రూపంలో శాసనమండలిలోకి వెళ్లాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌, ‌వామపక్షాల మద్దతు కోరతాం: కోదండరామ్‌
‌గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్‌, ‌వామపక్షాలను కోరతామని ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ కింది నుంచి నాలుగైదు స్థానాల్లో, అవినీతిలో పై నుంచి నాలుగైదు స్థానాల్లో ఉందని ఎద్దేవా చేశారు. మనందరి జీవితాలను అతలాకుతలం చేసిన కోవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫమైందన్నారు. ఈ పరిస్తితి మారకపోతే తెలంగాణ పూర్తిగా ఆగమవుతుందనీ, గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకుని టీజెఎస్‌ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ ‌విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply