Take a fresh look at your lifestyle.

మోకరిల్లుతున్న బ్యూరోక్రసి

  •  రాజకీయ మత్తుకు.. అధికారుల దాసోహం
  •  వంగి వంగి దండాలు.. సాగిలపడి సలాంలు

(కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి) జగిత్యాల అర్బన్‌, ‌నవంబర్‌ 17 (‌ప్రజాతంత్ర విలేఖరి): భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలకు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అఖిల భారత సర్వీసు అధికారులు.. అధికార నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు తలవంపులు తెస్తున్నారు. అధికార రాజకీయ అవినీతి, అక్రమ, అసాంఘిక కార్యకలాపాలకు వంతపాడుతు తమ మకిలి చేష్టలతో ప్రజాస్వామ్యానికి మాయని మచ్చను తెస్తున్నారు. దేశంలోనే అత్యున్నతమైన సివిల్‌ ‌సర్వీసెస్‌ ఉద్యోగం ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన యువతకు తీరని కల. లక్షల్లో ఒకరుగా ఎంతో మేదోశక్తి గల వారిని వరించే ఈ పదవికి ఎంతో మంది వన్నె తెస్తుండగా కొందరు మాత్రం రాజకీయ నాయకులకు సాగి దండాలు పెడుతున్న వైనం సిగ్గుచేటు. నిన్నటి వరకు సిద్దిపేట కలెక్టర్‌ ‌గా విధులు నిర్వహించిన పరిపాటి వెంకట్రామిరెడ్డి మరో 10 నెలలు సర్వీస్‌ ఉం‌డగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి తహతహలాడుతుండటం విశేషం. ఒక్క సిద్దిపేట కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి మాత్రమే కాదు… దేశంలో ఎంతమంది సివిల్‌ ‌సర్వీస్‌ అధికారులుగా పనిచేసి తదనంతర కాలంలో వివిధ రాజకీయ పార్టీల తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. భారత దేశ మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్‌ ‌సింగ్‌, ‌ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌కూడా సివిల్‌ ‌సర్వీసెస్‌ అధికారులుగా సేవలు అందించి తదనంతర కాలంలో ఉన్నతమైన పదవులు చేపట్టిన వారే. దీనిలో తప్పేమి లేదు.

కానీ సివిల్‌ ‌సర్వీసెస్‌ అధికారులు గా ఉండి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారు చెప్పింది చేస్తూ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ వారికి సాగి దండాలు పెడుతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. తమ దీక్షా, దక్షలతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా ప్రభుత్వ విధానాలను అమలు పరిచి పర్యవేక్షించాల్సిన దేశ అత్యున్నత సివిల్‌ ‌సర్వీస్‌ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కండువా కప్పుకోని కార్యకర్తలు గా ప్రవర్తిస్తూ ఆయా పార్టీలలో తమ బెర్త్ ‌లను రిజర్వేషన్‌ ‌చేసుకుంటున్న వైనం ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. మరికొంత మంది సివిల్‌ ‌సర్వీసెస్‌ అధికారులు ఆయా పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన పరిపాటి వెంకట్రాంరెడ్డి ఐదేళ్లుగా సిద్దిపేట కలెక్టర్‌ ‌గా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 20‌న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సిద్దిపేట జిల్లా పర్యటనలో కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఒక ఐఏఎస్‌ అధికారి ఇలా ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడమేంటన్న విమర్శలు ఆనాడు వ్యక్తమయ్యాయి. కలెక్టర్‌ ‌తాను జిల్లా పరిపాలనా అధికారి అన్న విషయం మరిచిపోయి ఓ రాజకీయ నేతలా వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పఠాన్‌ ‌చెరు నియోజక వర్గం నుండి టీఆర్‌ఎస్‌ ‌టికెట్‌ ఆశించగా నిరాశ ఎదురైంది. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్‌ ‌స్థానం, 2020 లో దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఇదే కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి పేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో వినిపించిన సంగతి తెలిసిందే. టికెట్‌ ‌కోసం ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్‌ ‌కాళ్లపై పడి ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే కలెక్టర్‌ ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాలు అప్పుడు వ్యక్తమయ్యాయి. అదే నిజమైంది. ఇటీవల అత్యుత్సాహంతో సిద్దిపేట జిల్లాలో వరి పంటను సాగు చేయవద్దని, విత్తన సంస్థలు వరి విత్తనాలు విక్రయించవద్దని ఆయన చేసిన హెచ్చరికలు దుమారాన్ని సృష్టించాయి. మల్లన్న సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌భూముల సేకరణ , గడిచిన ఎన్నికలు, భూబదలాయింపులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా 2017 లో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ ‌శరత్‌ ‌మాట్లాడుతూ ‘గణతంత్ర వేడుకల నిర్వహించే అవకాశం కల్పించిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి పాదాభివందనాలతో ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను’ అని తన ప్రసంగం పాఠంలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. తానేమి తక్కువ కాదన్నట్లు అదే జిల్లాలో పనిచేసే మెట్పల్లి సబ్‌ ‌కలెక్టర్‌ ‌ముషారఫ్‌ అలీ ఫారూకీ అదే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద సారు కంటే తానేమీ తక్కువ కాదన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుమార్తె అప్పటి నిజామాబాద్‌ ఎం‌పీ కల్వకుంట్ల కవిత కూర్చున్న సీటు వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని తన స్వామి భక్తిని ప్రదర్శించడం గర్హనీయం. 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో ఇదే కలెక్టర్‌ ‌జగిత్యాల జిల్లాలో ఒక నియోజకవర్గ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి కి అనుకూలంగా వ్యవహరించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ‌యంత్రాలలో సాంకేతిక సమస్య సృష్టించి జిమ్మిక్కు చేసి అధికార పార్టీ అభ్యర్థి ని స్వల్ప మెజారిటీ తో గెలిపించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ప్రవర్తిస్తున్న కొంతమంది సివిల్‌ ‌సర్వీసెస్‌ అధికారుల డర్టీ పాలి’ట్రిక్స్’ ‌ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేవే అని చెప్పక తప్పుదు.

Leave a Reply