Take a fresh look at your lifestyle.

కేకే మహేందర్‌రెడ్డికి కేసీఆర్‌ ‌గాలం..!

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌తనకు రాజకీయంగా బలమైన ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలని భావిస్తున్నారా ? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తనతో పాటు తన తనయుడు కేటీఆర్‌కు ఓటమి భయం లేకుండా ప్రతిపక్ష పార్టీలలో ఉన్న నేతలకు గులాబీ కండువ కప్పే వ్యూహాన్ని రచిస్తున్నారా ? తాజా రాజకీయ పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే ఓ బలమైన ప్రత్యర్థిని లాగేసి అత్యున్నత పదవిలో కూర్చుండబెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు కేటీఆర్‌కు దీటైన ప్రత్యర్థిని బుట్టలో వేసుకునే ప్రయత్నాలలో ఉన్నాడని గులాబీ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాపరెడ్డి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. సీఎంగా ఉన్నప్పటికీ కేసీఆర్‌కే చుక్కలు చూపించి దాదాపు ఆయనను ఓడించినంత పని చేశారు. దీంతో ఆయనను ఎన్నికల ప్రచారం సమయంలోనే కేసుల్లో ఇరికించి జైలుపాలు చేశాడు. అయినప్పటికీ వంటేరు ఏమాత్రం వెనక్కితగ్గకుండా రాజీలేని పోరాటం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌చేతిలో ఉన్న అధికారాన్నంతా ఉపయోగించి వంటేరును ఎలాగోలా ఓడించగలిగింది. దీంతో వంటేరు తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే ఎప్పటికైనా ముప్పు తప్పదనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ‌వంటేరు తన పార్టీలోకి రప్పించుకోగలిగారు. చివరకు వంటేరు గులాబీ కండువ కప్పుకోవడంతో ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌పదవి ఇచ్చి భవిష్యత్తులో రాజకీయంగా ఇక తనకు ముప్పు లేకుండా చేసుకున్నారు.

కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన తనయుడు కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీ రాజకీయాల వైపు దృష్టి సారించాలని చూస్తున్న కేసీఆర్‌ ఆయనకు కూడా రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌ ‌నియోజకవర్గమైన సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాడు. ఇప్పటికీ మూడు సార్లు సిరిసిల్లలో కేటీఆర్‌కు కేకే గట్టి పోటీ ఇచ్చారు. కేటీఆర్‌ ‌పోటీ చేసిన తొలిసారి కేకేపై కేవలం 131 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి, సిరిసిల్లలో కేటీఆర్‌ ‌గెలుపొందలేని పరిస్థితి ఉంటే తనయుడు కేటీఆర్‌ ‌రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా టీఆర్‌ఎస్‌ ‌నేత అయిన కేకే ఆ పార్టీలో బలమైన నేతగా ఎదిగాడు.

ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించిన కేటీఆర్‌ 2009‌లో కేకే నుంచి సిరిసిల్లను లాక్కుని అక్కడి నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ‌తరఫున కేటీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కేకే గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత కొండూరు రవీందర్‌ ‌రావును టీఆర్‌ఎస్‌లోకి లాగి ఆయనకు టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌వంటి రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చి తనకు పోటీ లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే రాజకీయ తంత్రాన్ని ఉపయోగించి కేకేకు గులాబీ కండువ కప్పే వ్యూహాలను కేసీఆర్‌, ‌కేటీఆర్‌లు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కేకే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. కేసీఆర్‌ ‌లేదా కేటీఆర్‌ అభయమిచ్చి పెద్ద పదవి ఇస్తానంటే గులాబీ గూటికి చేరేందుకు కేకే సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాదిరిగా ఒంటరి పోరు ఆపి కేసీఆర్‌ ‌పంచన చేరి ఏదైనా పదవి పొందాలని చూస్తున్నాడని కాంగ్రెస్‌ ‌పార్టీలో విస్త•తంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులందరినీ గులాబీ గూటికి తీసుకొచ్చే పనిలో తండ్రీతనయులు ఉన్నారని గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply