Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కైటెక్స్ ‌గ్రూపు రూ. 2,400 కోట్ల భారీ పెట్టుబడి

  • వరంగల్‌, ‌రంగారెడ్డిలలో వస్త్ర తయారీకి నిర్ణయం
  • ప్రత్యక్షంగా 22 వేల మందికి పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి
  • మంత్రి కెటిఆర్‌ ‌సమక్షంలో ఒప్పందం

రాష్ట్రంలో కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ ‌గ్రూప్‌ ‌భారీగా పెట్టుబడి పెడుతుంది. వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్‌ ‌పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ ‌సిద్ధమైంది. రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టాలని కైటెక్స్ ‌గ్రూప్‌ ‌నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కైటెక్స్ ‌గ్రూప్‌ ‌మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్ ‌గ్రూప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టాలని కైటెక్స్ ‌గ్రూప్‌ ‌నిర్ణయించిందని తెలిపారు. దీంతో 22 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 18 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. కైటెక్స్ ‌పరిశ్రమలో 85 నుంచి 90 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్ ‌కొనుగోలు చేయనుందని తెలిపారు.

సీఎస్‌ఆర్‌ ‌కింద రూ. 6 కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుందని పేర్కొన్నారు. వొచ్చే నవంబర్‌ ‌నుంచి కైటెక్స్ ‌గ్రూప్‌ ‌తమ ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఇతర రాష్ట్రాలు  కైటెక్స్‌ను ఆహ్వానించినా.. రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసి తాము ఆహ్వానించామన్నారు. ఆ తర్వాత పెట్టుబడి అవకాశాలను వివరించామని కేటీఆర్‌ ‌తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ‌చూపిన చొరవ వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని కైటెక్స్ ‌గ్రూప్‌ ఎం‌డీ సాబూ ఎం జాకబ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల వాతావరణం, విధానాలు నచ్చాయని పేర్కొన్నారు. 3 మిలియన్‌ ‌దుస్తులను ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తామని సాబూ ఎం జాకబ్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో కైటెక్స్ ‌గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌సాబు జాకబ్‌, ‌కంపనీ సీనియర్‌ ‌ప్రతినిధి బృందం సాబు జాకబ్‌ ‌పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కైటెక్స్ ‌సంస్థ చైర్మన్‌ ‌సాబు జాకబ్‌ ‌మాట్లాడుతూ చిన్నపిల్లల వస్త్రాల తయారీలో తమది ప్రత్యేకమైన కంపెనీ అని చెప్పారు.

ఈ కంపెనీ నుంచి తయారైన వస్త్రాలు ధరించని పసి పిల్లలు అమెరికాలో ఉండరని చెప్పేందుకు గర్వకారణంగా ఉందన్నారు. ‘కేరళ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్‌. ‌కేటీఆర్‌ని కలిసినప్పుడు తనకు పెట్టుబడి కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత తాము వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని 2400 కోట్లకు పెంచాము. దీంతో 22000 ఉద్యోగాలు వస్తాయి’ ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి 3 మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తాము. భవిష్యత్తులో తెలంగాణ వస్త్రాలు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరన్నది మా నమ్మకం అని తెలిపారు. అన్ని కార్మిక సంక్షేమ వసతులు తమ క్లస్టర్లలో ఉంటాయని, లక్షన్నర కిట్లను తెలంగాణ ప్రభుత్వానికి తమ కంపెనీ తరఫున అందిస్తామని వెల్లడించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు మాట్లాడుతూ వరంగల్‌ ‌జిల్లా గీసుకొండ-సంగెం, రంగారెడ్డి సీతారాంపూర్‌ ‌లలో దుస్తులు తయారీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయడానికి కైటెక్స్ ‌కంపెనీ ముందుకు రావడం సంతోషంగా వుందన్నారు. సీఎం కెసిఆర్‌ ‌పరిపాలనతో దేశంలో తెలంగాణకు మంచి పేరు వొచ్చింది. కైటెక్స్ ‌కంపెనీకి కూడా మంచి పేరుంది. రాష్ట్రంలో కైటెక్స్ ‌కంపెనీ పెట్టే పెట్టుబడులతో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే బట్టలకు కూడా మంచి డిమాండ్‌ ఉం‌టుంది. ఈ ప్రాజెక్ట్ ‌ద్వారా 22వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకా అనేక మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని సీఎం కేసిఆర్‌, ‌మంత్రి కేటిఆర్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా ఉమ్మడి భూ కేటాయింపులు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌, ‌కైటెక్స్ ‌గ్రూప్‌ ‌ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply