Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌ ‌కార్యాలయంపై ఎలా దాడి చేస్తారు

  • ఎంపి కార్యాలయం వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు
  • కోవిడ్‌ ‌నిబంధనలు బిజెపికి మాత్రమే వర్తిస్తాయా
  • కెసిఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
  • బండి సంజయ్‌ ‌కార్యాలయాన్ని సందర్శించిన కిషన్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర, కరీంనగర్‌ : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌ ‌కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. జాగరణ దీక్ష సందర్భంగా కార్యాలయంలో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్‌, ‌సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫీస్‌ అద్దాలు ధ్వంసం, సీసీ పుటేజీ ఎత్తుకుపోవడమేంటని నిలదీశారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ ఆఫీస్‌లోకి రావడానికి పోలీసులకు ఏం అధికారం ఉందన్నారు. ప్రజా సమస్యలపై సంజయ్‌ ‌దీక్ష చేస్తే పోలీసులు అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ ఆఫీస్‌ను యుద్ధభూమిగా మార్చారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి సంజయ్‌ని జైలుకు పంపారని మండిపడ్డారు. కోవిడ్‌ ‌నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కొవిడ్‌ ‌నిబంధనలు బీజేపీ ఆఫీస్‌కు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి అన్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి జైలులో పరామర్శించారు. జాగరణ దీక్షణ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ ‌తీరును కడిగిపారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అ‌క్రమ అరెస్టులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని..టీఆర్‌ఎస్‌ ‌తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి నిర్బంధం, నియంతృత్వం చూడలేదని, కేసీఆర్‌ ‌తీరు నిజాం పాలనను తలపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, మేథావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కిషన్‌ ‌రెడ్డి..తెలంగాణ సమాజం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు. భాజపా నేతలను కేసీఆర్‌ ‌సర్కార్‌ అ‌క్రమ కేసులతో వేధిస్తుందని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కోవిడ్‌ ‌నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధర్నాచౌక్‌లో సీఎం ఆందోళన చేయవచ్చు..ప్రతిపక్షాలు చేయకూడదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణచివేత లేదని అన్నారు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా? అని అడిగారు. దిల్లీలో ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదన్న కిషన్‌ ‌రెడ్డి..కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.

Leave a Reply