Take a fresh look at your lifestyle.

మోదీ వొచ్చేవరకు కిషన్‌రెడ్డి తెలంగాణలో రైలెక్కలేదా..?

Kishan Reddy Telangana Can't Train till Modi Comes

నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యేవరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రైలు మార్గం కోసం ముఖం వాచిపోయారా? అంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాటలు వింటే అవుననే అనిపిస్తుంది. ఆయన లెక్క ప్రకారం తెలంగాణ ప్రజలు రైలు బండి కూతకు నోచుకోక దశాబ్దాల కాలం గడుస్తున్నదంటే నిజంగానే నమ్మాల్సిందే. ఎందుకంటే దేశంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత చాలా చారిత్రక వక్రీకరణలు సంభవిస్తున్నాయి. గతంలో అవుననుకున్నవి కాకుండా పోతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌సర్దార్‌ ‌వల్లభాయిపటేల్‌ ‌లాంటి వారిని గతంలో కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేనివారిగా బిజెపి సొంతం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నట్లుగానే అనేక విచిత్రకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందుకో తెలంగాణ అంటే మొదటి నుండీ అందరికీ చిన్నచూపే. గతంలో కూడా తెలంగాణపైన ఇలాంటి మాటలే విన్నాం. తెలంగాణ ప్రజలకు పొద్దున లేవడం అలవాటేలేదని, ఎన్టీఆర్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాతే ఇక్కడి ప్రజలకు పొద్దున లేవడానికి అలవాటు పడ్డారని గతంలో ఓ నాయకుడు వికారంగా మాట్లాడిన విషయం నేటికీ తెలంగాణ ప్రజల గుండెలను రగిలిస్తోంది. ప్రపంచపటంలో హైదరాబాద్‌కు నేనే గుర్తింపు తెచ్చానంటూ ఇప్పటికీ గొప్పలుచెప్పుకుంటున్న నాయకులూ ఉన్నారు. ఆనాడు సమైక్యాంధ్రలో ఉండడంవల్ల ఆ అవమానాలను తెలంగాణ ప్రజలు భరించారు. కాని నేడు ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతకూడా అలాంటి వెక్కిరింపులను ఇంకా వినాల్సిరావడంకన్నా దురదృష్టకరం మరోటిలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే మోదీ ప్రధాని కాకముందు అసలు తెలంగాణ ప్రజలకు రైళ్ళు అంటేనే తెలువదన్న స్థాయిలో మాట్లాడడం విచారకరం. అంతకుముందు కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కేవారనీ, మోదీ వొచ్చినతర్వాతే ఇక్కడ మార్పు వొచ్చిందన్నది ఆయన ఉవాచ. అంతెందుకు దాదాపు ఆరుపదులు దాటిన కిషన్‌రెడ్డి ఆరేళ్ళక్రితం వరకు అంటే మోదీ ప్రధాని అయ్యేవరకు రైలు ప్రయాణానికి నోచుకోలేదన్నట్లేకదా పాపం.

ఎందుకంటే ఆయన పుట్టింది తెలంగాణలోనేకదా. ఆయన పుట్టడానికి సుమారు డెబ్బై ఏళ్ళకింద ఇక్కడ రైళ్ళు తిరుగాడిన విషయం ఆయనకు తెలియదనుకోవాలా? స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అనేక రాజ్యాలకు ధీటైన పాలన తెలంగాణలో జరిగిందన్న చారిత్రక సత్యాన్ని మేము ఒప్పుకోమంటే చేసేదేమీలేదు. చరిత్రను తిరిగరాయడానికి ప్రయత్నించ వొచ్చేమోగాని, వాస్తవాలను మరుగునపర్చడం మాత్రం ఎవరి వల్లకాదన్న విషయాన్ని అర్థంచేసుకోక పోవడం దురదృష్టకరం. ఈ ప్రాంతాన్ని ఏలిన నిజాం సర్కార్‌ల మీద కొందరికి కోపముండవచ్చు గాక, ఆయన దుశ్చర్యలకు ఈ ప్రాంతం బలి అయిందనడంలో వాస్తవంలేకపోలేదు. అలాగే నాటి రాజులకాలంలోనే జరిగిన అభివృద్ధిని కాదనలేము. ఆనాడే మరే రాజ్యంకూడా నిర్వహించలేని రైల్వేను, ఇవ్వాళ కేంద్రమంత్రి ఎర్రబస్సు అని హేళనగా మాట్లాడిన బస్సు సౌకర్యాన్ని తెలంగాణ ప్రజలకు ఏనాడో అందుబాటులోకి తీసుకొచ్చారు. 1870లోనే నిజాం స్టేట్‌ ‌రైల్వే శాఖ ఏర్పడిందన్న విషయాన్ని రైల్వేచరిత్రలోనే నిలిచిఉంది. నరేంద్రమోదీ వొచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలకు రైలంటే ఏమిటో తెలుసన్న కిషన్‌రెడ్డికి బహుషా 1907లో నాటి నిజాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన నాంపల్లి రైల్వేస్టేషన్‌ ‌గురించిగాని, 1916లో ఏర్పాటు చేసిన కాచీగూడ రైల్వేస్టేషన్‌ల గురించిగాని, ఆ తర్వాత ఒకదానివెంట ఒకటిగా ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన రైల్‌ ‌స్టేసన్‌లు, జంక్షన్‌లన్నీ కూడా అవునన్నా, కాదన్నా నిజాం నిర్మాణాలే అని తెలియదనుకోలేము. ఒకనాటి నిజాం స్టేట్‌ ‌క్యాపిటల్‌, ‌నేటి తెలంగాణరాష్ట్ర రాజధానిలో నగరవాసిగా కిషన్‌రెడ్డికి ఈ విషయాలన్నీ తెలువవని అనుకోలేము. తెలిసి మాట్లాడినా, తెలువక మాట్లాడినా ఆయన మాటలుమాత్రం తెలంగాణ ప్రజలను తీవ్రంగా గాయపర్చాయనే చెప్పాలె. తెలంగాణలో కాషాయ జంఢాను ఎగురవేయాలన్న ఉత్సాహం ఉంటే ఉండవచ్చుగాక.

తమరాజకీయ లబ్ధికోసం టిఆర్‌ఎస్‌ను, దాని అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిత్యం టార్గెట్‌చేయవచ్చుగాని, తెలంగాణ ప్రజలను అవమానించేవిధంగా మాటలు జారటంమాత్రం సరైందికాదు. మోదీ వొచ్చేదాక తెలంగాణ ప్రజలకు అసలు రైలు అంటేనే తెలియదని, అప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఎర్రబస్సే దిక్కని అంటే ఈ ప్రాంత ప్రజలకు అంతకన్న అవమానమేముంటుంది? ఇలాంటి మాటలతోనే భారతీయ జనతాపార్టీ ప్రజలకు దూరమవుతున్నది. అందుకు ఇవ్వాళ దేశ రాజధాని నగరంలో జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. అధికారంలోఉన్న బిజెపి ప్రభుత్వం దేశాన్ని ఎక్కడినుండి అయితే శాసిస్తున్నదో, అదే గొడుగు కింద ఉన్న వోటర్లను ప్రభావితం చేసుకోలేకపోయిందంటే ఇలాంటి మాటజారుడు చర్యలేనన్నది సుస్పష్టం. ఇదే విషయాన్ని కేంద్ర హోం వాఖ మంత్రి అమిత్‌షా ఒప్పుకోవడం నిజంగా మెచ్చుకోతగిన విషయమేమరి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత ఆయన అన్న మాటలను ఇతర నాయకులుకూడా అర్థం చేసుకోవాల్సిఉంది. తమ నాయకులు తొందరపడి నోరుజారుతుండడమే తమకు ముప్పుగా సంభవించిందన్న సత్యాన్ని ఆయన గ్రహించినట్లు కిషన్‌రెడ్డి లాంటి ఇతర నాయకులుకూడా గ్రహించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.

Leave a Reply