Take a fresh look at your lifestyle.

దిల్లీ ప్రభుత్వం దిగిరావాల్సిందే..

దిల్లీ ప్రభుత్వం దిగివొచ్చేవరకు తమ ఆందోళన విరమించేదిలేదంటోంది సంయుక్త కిసాన్‌ ‌మోర్చ. కిసాన్‌ ‌మోర్చ దిల్లీ కేంద్రంగా ఆందోళన చేపట్టి బుధవారానికి ఆరునెలలైంది. ఈ ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలేవీ ఫలప్రదం కాలేదు. కాగా, వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలు వెనక్కు తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దేశంలో రైతాంగమంతా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు నేటితో ఆరు నెలలు పూర్తి అయింది. దేశంలో రైతాంగం చేపట్టిన ఆందోళనల్లో ఇంత సుదీర్ఘంగా సాగింది మరోటి లేదని చెప్పాలే. ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యాన, ఉత్తరప్రదేశ్‌ ‌రైతాంగం చలి కాలం ప్రారంభించిన వారి ఉద్యమం ఎండ అనక, వాన అనక రోడ్లపై గుడారాలేసుకుని కేంద్రం వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన కొత్త చట్టాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కేంద్రం తమ డిమాండ్లపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మే 26న దేశవ్యాప్తంగా రైతాంగమంతా బ్లాక్‌ ‌డేను పాటించాలని సంయుక్త కిసాన్‌ ‌మోర్చ పిలుపునిచ్చింది.

ఈ పిలుపును పురస్కరించుకుని దిల్లీ, పంజాబ్‌, ‌హర్యానాతోపాటు మరి కొన్ని చోట్ల రైతులు నల్ల జండాల ప్రదర్శన నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహన చోదకులు కూడా తమ వాహనాలకు నల్ల జంఢాలు కట్టుకున్నారు. కాగా హర్యాన, పంజాబ్‌లో రైతులందరు తమ ఇండ్లపైన నల్లజండాలను ఎగురవేసి కేంద్ర వైఖరి పట్ల తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల కేంద్రంలోని అధికార పార్టీ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కాగా రైతులు ఇచ్చిన ఈ పిలుపుకు రైల్వే కార్మికులు తమ మద్దతు ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం పట్ల వారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్‌ ‌స్కీంను పునరుద్దరించాలని, కొరోనా బీమా కల్పించాలన్న తదితర డిమాండ్లతో వారు కూడా రైతాంగానికి తమ మద్దతు పలికారు. కాగా సంయుక్త కిసాన్‌ ‌మోర్చ పిలుపుకు మద్దతుగా ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో వామపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను అమోదించింది. ఆ రోజునుండే పంజాబ్‌ ‌రైతాంగం వాటిని వ్యతిరేకిస్తూ వొచ్చింది. రైల్‌ ‌రోకోలు, ఛలో దిల్లీ కార్యక్రమం, ట్రాక్టర్ల ప్రదర్శనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. అయితే రోజురోజుకు తీవ్ర మవుతున్న కిసాన్‌ ఆం‌దోళనను అడ్డుకోవడానికి కేంద్రం కూడా అనేక ప్రయత్నాలు చేసింది. దాదాపు పదకొండు సార్లు జరిపిన చర్చలేవి ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు జరిగిన ప్రతీసారి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలు ఎత్తివేయాలని రైతు నాయకులు కూర్చుంటే, అ ఒక్కటి తప్ప అంటూ వొచ్చింది కేంద్ర ప్రభుత్వం. చివరకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వొచ్చింది. సుప్రీమ్కో ర్టు అటు ప్రభుత్వం, ఇటు రైతు నాయకులతో చర్చించి తమకు నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆదేశించింది. ఆ కమిటీలో ఉన్న వారి నిబద్దతను రైతు నాయకులు ఎత్తిచూపడం తో కొందరు కమిటీని నుండి విరమించుకున్నారు కూడా.

ఇదిలా కొనసాగుతుండగానే రైతుల ఆందోళనలో అంతర్జాతీయ సంస్థలు చొరబడ్డాయని, భారత దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఆరోపించడమేకాకుండా, ట్రాక్టర్‌ ‌ర్యాలి సందర్భంగా జరిగిన అల్లర్లను పురస్కరించుకుని కొందరిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ అందోళన ఇలా సాగుతుంటే దేశంలో కొరోనా విలయతాండం చేస్తుండడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధించడంతో గత నాలుగు నెలలుగా రైతుల ఆందోళన ఇప్పుడు ఆన్‌లైన్‌కే పరిమితమైంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్దత కల్పించాలని, విద్యుత్‌ ‌సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న తదితర తమ డిమాండ్లను కేంద్రం నేరుగా తమతో చర్చించినప్పుడే సమస్య ఒక కొలిక్కి వొస్తుందని రైతు నాయకులంటున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. అధికారంలో ఉన్న నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి భయపడి ఆందోళన విరమిస్తే తమ ముందు తరాల వారికి అన్యాయం చేసినవారమవుతామంటున్నారు రైతు నాయకులు.

Leave a Reply