Take a fresh look at your lifestyle.

గాంధేయవాదానికి ప్రతీక ఖాసా సుబ్బారావు

“టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించి సంపాదకత్వం వహించిన ’’స్వరాజ్య’’ పత్రికలో ఉపసంపాదకునిగా 1921లో పత్రికారంగ ప్రస్థానం ప్రారంభించారు. ఖాసా సుబ్బారావు మద్రాసుకు వచ్చి ‘‘స్వరాజ్య’’ ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని టంగుటూరి ప్రకాశం భావించి, మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించారు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా, సంపాదకుడిగా వ్యవహరించారు. కె.ఎం.ఫణిక్కర్‌ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా వ్యవహరించేవారు. ఖాసాతో పాటు ఎస్‌.ఎన్‌.‌వరదాచారి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఎం.చలపతిరావు మొదలైన వారు ఈ పత్రిక ఉపసంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక 1921లో ప్రారంభమై 1935 వరకు వెలువడింది. జర్నలిస్టుగా ఖాసా సుబ్బారావు రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది.”

(జూన్‌ 16 ‌ఖాసా 60వ వర్థంతి)

గాంధేయవాదానికి, నీతి నియమాలకు నిలువెత్తు దర్పణంగా, బతికిన ప్రముఖ పత్రికా సంపాదకుడు ఖాసా సుబ్బారావు. టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించి సంపాదకత్వం వహించిన ’’స్వరాజ్య’’ పత్రికలో ఉపసంపాదకునిగా 1921లో పత్రికారంగ ప్రస్థానం ప్రారంభించారు. ఖాసా సుబ్బారావు మద్రాసుకు వచ్చి ‘‘స్వరాజ్య’’ ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని టంగుటూరి ప్రకాశం భావించి, మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించారు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా, సంపాదకుడిగా వ్యవహరించారు. కె.ఎం.ఫణిక్కర్‌ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా వ్యవహరించేవారు. ఖాసాతో పాటు ఎస్‌.ఎన్‌.‌వరదాచారి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఎం.చలపతిరావు మొదలైన వారు ఈ పత్రిక ఉపసంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక 1921లో ప్రారంభమై 1935 వరకు వెలువడింది. జర్నలిస్టుగా ఖాసా సుబ్బారావు రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది.

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో యాజ్ఞవల్క్య బ్రాహ్మణ (ప్రథమశాఖ) సామాన్య మధ్యతరగతి కుటుంబంలో రామాబాయమ్మ, సుందరరామారావు దంపతులకు 1896, జనవరి 23న జన్మించారు. ఖాసా హైస్కూలు విద్య నెల్లూరులో పూర్తి చేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌మద్రాసు కాలేజీలో వీరికి గురువు. ఈయనపై డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌బోధనల ప్రభావం జీవితాంతం ఉంది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు.

పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి నెల్లూరుకు వలసవచ్చారు. భార్య భవానిబాయి, తల్లి రామాబాయంమ్మలతో కలిసి నెల్లూరు జిల్లా పల్లిపాడులో గాంధీజీ ప్రాంరంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో ఉన్నారు. చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, దిగుమర్తి హనుమతరావు, బుచ్చిక్రిష్ణమ్మ, కొండిపర్తి పున్నయ్య తదితర ఆశ్రమ వాసులతో కలిసి సత్యం, అహింస, బ్రహ్మచర్యం మొదలయిన 11 సూత్రాలను ఆచరిస్తూ, నిర్మాణకార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు లోని ఒక మిడిల్‌ ‌హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రాజమండ్రి వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ప్రారంభంలో కొంతకాలం టీచరుగా, హెడ్మాస్టరుగా పనిచేశారు. ఈ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలోని 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.

గాంధీమహాత్ముడు సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించినపుడు ఖాసా సుబ్బారావు స్వాతంత్య్రోద్యమం 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని. సత్యాగ్రహ లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి అనేక చోట్ల విస్తృతంగా పర్యటించారు. వీరి తల్లిగారు కూడా గ్రామగ్రామాలలో పర్యటించి సహకరించారు. కుమారుని ఆశయాలకు వత్తాసు పలికి తన ఆరోగ్యాన్ని సైతం ఖాతరు చేయక తనయుని బాగోగులను చూసుకోవడం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఈయన 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1931లో మద్రాసు చైనాబజారులో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసు లాఠీ దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి మూర్ఛ పోయారు. ఈ సంఘటన బ్రిటీష్‌ ‌పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించింది. ఈ సంఘటనపై విచారణ జరిపిన ఏక సభ్య కమిషన్‌ ‌లార్డ్ ‌లూథియన్‌ ‌జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును పరామర్శించి లాఠీచార్జ్ ‌ను తీవ్రంగా ఖండించింది. 1942-44ల మధ్య ఈయన క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పాల్గొని 20 నెలల కారాగార వాసం అనుభవించారు

జాతీయ భావాలు అధికంగా ఉన్న ఖాసాను ప్రకాశం పంతులు ఏరికోరి తన పత్రిక సంపాదకునిగా నియమించుకున్నారు. అప్పటినుండి ఖాసాకు పత్రికారంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నిర్భీతి, స్పష్టతతో ఆయన రాసే కథనాలు విశేషంగా ప్రజల మన్ననలు పొందాయి. రాజాజీతోపాటు పలువురు రాజకీయ ఉద్దండులు ఆయన కలంపోటుకు గురయ్యారు. అయినప్పటికీ అందరూ ఆయన్ను ఎంతో గౌవించేవారు. అభిమానించేవారు. 1936 వరకు స్వరాజ్యలో పనిచేసిన ఖాసా అనంతరం కోల్‌కతా నుండి వెలువడే ఇండియన్‌ ‌ఫైనాన్స్, ‌ముంబాయి నుండి వెలువడే ప్రీ ప్రెస్‌ ‌జర్నల్‌లో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌జాయింట్‌ ఎడిటర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రభకు తొలి సంపాదకులు ఆయనే.

ఖాసా సుబ్బారావు గొప్ప సంపాదకుడే కాకుండా అంతకు మించిన మానవతావాది. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారు. విద్యార్థి దశలో ఒక బీద విద్యార్థికి తన రెండు జతల బట్టలను దానం చేసి తను ఒక జత దుస్తులతో సర్దుకున్నారు. మిత్రుడైన సి.ఎస్‌.‌రంగస్వామి సోదరుడు షేర్‌ ‌మార్కెట్టులో నష్టపోయి అప్పులపాలైతే ఈయన సొంత భూములు అమ్మి మరీ సహాయం చేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌పత్రికలో సహ ఉద్యోగికి జరిగిన అన్యాయం నిరశిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినా తన బట్టలు ఉతికిపెట్టే వరదన్‌ అనే వ్యక్తి గురించి స్వతంత్ర పత్రికలో ఒక పెద్ద వ్యాసం ప్రచురించారు. .

స్వతంత్ర స్వతంత్ర భావాలు కలిగిన ఈయన ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించారు. మిత్రుడు ఉప్పులూరి కాళిదాసు సహకారంతో 1946లో స్వతంత్ర అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించారు. 1948లో తెలుగు స్వతంత్రను ప్రారంభించారు. ఈ రెండు వారపత్రికలను పదేళ్ల పాటు బలమైన రాజకీయ వార్తాపత్రికలుగా నడిపారు. తెలుగు స్వతంత్రలో చాలా అపురూపమైన సాహిత్యం ప్రచురితమైంది. ఈ రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం తొలినాళ్ళలో లేకున్నా అప్పటికి ఔత్సాహిక రచయిత అయిన భరాగో ఉత్తరంలో కోరడంతో సరిదిద్దుకుని ఆపైన రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పత్రిక మూతబడింది. ఈ పత్రిక ఉత్థాన పతనాలను తన ‘ వీవఅ ఱఅ •ష్ట్రవ •ఱఎవ శ్రీఱస్త్రష్ట్ర• ‘ గ్రంథంలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఖాసా సుబ్బారావు 1961, జూన్‌ 16‌న తుదిశ్వాస వదిలారు…
– నందిరాజు రాధాకృష్ణ, 9848128215.

Leave a Reply