Take a fresh look at your lifestyle.

మళ్లీ హైదరాబాదుకు

కె జి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను 2005 నుంచి రెండు సంవత్సరాల పాటు ధారావాహికంగాప్రచురించి, పుస్తకంగా కూడ ప్రచురించిన ప్రజాతంత్ర ఆ జ్ఞాపకాలను సవినయంగా గుర్తు చేసుకుంటున్నది. సరిగ్గా అటువంటి పరిణామాలే మళ్లీమళ్లీ జరుగుతున్న ఈ చారిత్రక సందర్భంలో పదిహేను సంవత్సరాల కిందటి ఆ ధారావాహికను మళ్లీ ఒకసారి ప్రచురించాలని తలపెడుతున్నది. ‘వీక్షణం’ సంపాదకులు ఎన్‌ .‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కె జి కన్నబిరాన్‌ ‘24 ‌గంటలు..ఆత్మకథాత్మక సామాజిక చిత్రం’మళ్లీ ఒకసారి ధారావాహికగా ప్రజాతంత్ర పాఠకుల కోసం..

“అప్పుడు నా ఆదాయం గురించి నేనొక నియమం పెట్టుకున్నాను. కక్షిదారు ఎవరయినా సరే పిచ్చిగా డబ్బులు చేసుకోగూడదు. డబ్బులు సంపాదించాలనే యావలో పడిపోగూడదు. కంపెనీ వ్యాజ్యాలకు కూడ నేను నా మామూలు ఫీజు కన్న ఎక్కువ వసూలు చేసేవాణ్ని కాదు. ఇతర కేసుల్లోనయితే వారు ఇస్తే తీసుకోవడమే తప్ప నాకై నేను అడిగింది లేదు. అసలు ఈ న్యాయవాద వృత్తిలోను, బైట జీవితంలోనూ కూడ నేను నా కోసమో, నా కుటుంబం కోసమో ఎవరినీ ఏమీ అడగలేదు.”

మోహనకుమార మంగళం నాకు బాగా పరిచయం. అప్పటికి నాలుగైదేళ్లుగా మద్రాసు హైకోర్టులో నా న్యాయవాద వృత్తి అంతంత మాత్రంగా ఉండడంతో ఆయన దగ్గర జూనియర్‌గా చేరుదామనుకున్నాను. అప్పటికే ఆయన సీనియర్‌ ‌న్యాయవాదిగా ఉన్నారు. ‘నా ఆఫీసు తీసేశాను. సీనియర్‌ ఎంగేజ్‌మెంట్స్‌కు మాత్రమే వెళ్తున్నాను’ అని ఆయన నేనక్కడ చేరడానికి కుదరదన్నాడు. ఇక నాకు మరో మార్గం చూసుకోక తప్పలేదు. ఇక హైదరాబాదు వద్దామనుకున్నాను. నాకిక్కడ ఏదో మద్దతు ఉన్నదని కాదు గాని మద్రాసు ప్రాక్టీసు కన్న హైదరాబాదు ప్రాక్టీసే మంచిదని అనుకున్నాను. నిజంగా తొలిరోజుల్లో న్యాయవాద వృత్తిలో రాణించడానికి చాలా కష్టాలు పడ్డాను. ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నేనీ జీవితకథనం రాయదలచుకున్న పద్దతికి అవి అంత ముఖ్యం కాదు. నెలకు నూటయాభై రూపాయల జీతంతో రెడ్డి మహిళా కళాశాలలో వసంత లెక్చరర్‌గా చేరింది. యాభై రూపాయల కిరాయతో చిక్కడపల్లిలో ఒక ఇల్లు తీసుకున్నాం.

మొదటినుంచీ కూడా నేను వాదనలలో సమర్ధుడైన న్యాయవాదిగా ఉన్నాననే నేననుకుంటాను. 1968-69 వచ్చేటప్పటికి నా ఆఫీసు చాలా పెద్ద ఆఫీసే అయింది. నా దగ్గర చాలా కేసులు జమకూడాయి. అయితే ఆ ఏడెనిమిది సంవత్సరాల నా న్యాయవాద వృత్తిలో నేను పొందిన అనుభవాలు, నేను నిర్ణయించుకున్న జీవన సూత్రాలు, హైదరాబాదు జీవితంలో నేను పొందిన స్నేహాలు ఆ తర్వాతి జీవితంలో ముఖ్యపాత్ర వహించాయి. అప్పట్లో నేను కొంతకాలం సెకండ్‌ ‌గవర్నమెంట్‌ ‌ప్లీడర్‌ ఆఫీసులో పనిచేశాను. అక్కడ చేరడం విచిత్రంగా జరిగింది. మా నాన్న మరణశయ్యపై ఉన్నప్పుడు నేను ఆయనకు ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ ‌సంపాదించడం కోసం అటూ ఇటూ ఆదుర్దాగా పరుగులు పెడుతున్నాను. అప్పుడు నా ముందర ఒక కారు ఆగింది. ఆ కారులోని వ్యక్తే సెకండ్‌ ‌గవర్నమెంట్‌ ‌ప్లీడర్‌ ‌శంకరరావు.

ఆయన నన్ను ఎన్‌.ఎస్‌. ‌రాఘవన్‌ ఆఫీసు ఎక్కడ అని అడిగారు. రాఘవన్‌ అప్పటి అడ్వకేట్‌ ‌జనరల్‌. ‌నేనాయనకు రాఘవన్‌ ఆఫీసు ఎక్కడుందో చూపాను. కొన్నాళ్ళకే నేనాయన దగ్గరే చేరబోతున్నానని నాకప్పటికి తెలియదు. ‘నాకు మీ ఆఫీసులో చేరాలని వుంది. మీరు నాకు ఒక్క పైస కూడా ఇవ్వనక్కర లేదు. న్యాయవాద వృత్తి నేర్చుకునేలా చాల పని ఇస్తే చాలు’ అన్నాను. ఆయన చాల పని ఇవ్వడంలోనూ, డబ్బు ఇవ్వకపోవడం లోనూ కూడా మాట నిలబెట్టుకున్నారు. ఆరు నెలల లోపలే నేను న్యాయవాద వృత్తిలో నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాను. అన్ని కోర్టులతోనూ, జడ్జీలందరితోనూ పరిచయం పెంచుకున్నాను. జడ్జీలు నన్ను గుర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత నా ప్రాక్టీసు మొదలయింది.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను మద్రాసు హైకోర్టులో ఉండగా వి సి గోపాల రత్నం అని ఒక సీనియర్‌ ‌న్యాయవాది ఉండేవారు. చాలా ప్రేమాస్పదుడైన మనిషి ఆయన. ప్రతి రోజూ యువ న్యాయవాదులందరమూ ఆయన చుట్టూ చేరేవాళ్ళం. ఆయన విపరీతంగా జోక్స్ ‌చెప్పేవారు. ఇతర పుస్తకాలతోపాటు ఆయన దగ్గర జోక్స్ ‌పుస్తకాలు కూడా చాల ఉండేవి. ఒక సంచీ నిండా వేరు వేరు రకాల పెన్నులుండేవి. హైదరాబాదు వద్దామని నిర్ణయించుకున్నప్పుడు నేనాయన దగ్గరికి వెళ్ళి నా నిర్ణయం గురించి చెప్పాను. ‘‘వెళ్ళిన కొత్తలో ప్రాక్టీసు ఉండదు. కాని నువ్వంటూ ఒక ప్లీడరువు ఉన్నావని లోకానికి తెలియాలి. ఒక ఆఫీసు పెట్టుకో. అందరికీ కనబడేటట్టుగా కూచో, వెనుక ఒక బీరువా పెట్టుకుని పాత ‘లా’ పుస్తకాలు కొన్ని పెట్టుకో. కూచుని చదువుకుంటూ ఉండు. అదే ప్రారంభం. వచ్చిపోయే వాళ్ళందరూ అక్కడ ఒక ప్లీడరు ఉన్నాడని, అందుబాటులో ఉన్నాడని, ఎప్పుడు చూసినా నమ్మకంగా కనిపిస్తాడని అనుకోవాలి. వాళ్ళలో ఎవరికైనా, వాళ్ళలో ఎవరి స్నేహితులకైనా ప్లీడరు అవసరం వచ్చినప్పుడు నీ పేరు గుర్తొచ్చేలా ఉండాలి’’ అని గోపాలరత్నం సలహా చెప్పారు.

నేనా సలహాను పూర్తిగా అక్షరాలా పాటించాను. మారేడుపల్లిలో ఆఫీసు తెరిచాను. నరసింహాచారి అనే అప్రెంటిస్‌ ‌లాయర్‌ ‌నా దగ్గర చేరాడు. కొన్నాళ్ళకు అహ్మద్‌ అనే తమిళ ముస్లిం లాయరు కూడా చేరాడు. క్రమక్రమంగా నా ఆఫీసు గుర్తింపులోకి వచ్చింది. చాలా కేసులు రావడం మొదలయింది. అప్పుడే కృపాల్‌ ‌సింగ్‌ అని నా స్నేహితులొకరు ప్యారీ అండ్‌ ‌కంపెనీలో ఉండేవారు. ఆయనా నేను క్రికెటర్లుగా స్నేహితులం. ఆయన ద్వారా ప్యారీ అండ్‌ ‌కంపెనీ నన్ను తమ లాయర్‌గా నియమించుకుంది. అలా చాలా కంపెనీలు వచ్చి నన్ను తమ లీగల్‌ అడ్వైజర్‌గా పెట్టుకున్నాయి. సివిల్‌ ‌లిటిగేషన్‌ ‌కేసులు చాలా రావడం మొదలయింది. అప్పుడు నా ఆదాయం గురించి నేనొక నియమం పెట్టుకున్నాను. కక్షిదారు ఎవరయినా సరే పిచ్చిగా డబ్బులు చేసుకోగూడదు. డబ్బులు సంపాదించానే యావలో పడిపోగూడదు. కంపెనీ వ్యాజ్యాలకు కూడ నేను నా మామూలు ఫీజు కన్న ఎక్కువ వసూలు చేసేవాణ్ని కాదు. ఇతర కేసుల్లోనయితే వారు ఇస్తే తీసుకోవడమే తప్ప నాకై నేను అడిగింది లేదు. అసలు ఈ న్యాయవాద వృత్తిలోను, బైట జీవితంలోనూ కూడ నేను నా కోసమో, నా కుటుంబం కోసమో ఎవరినీ ఏమీ అడగలేదు.

వసంతకు కాలేజి దూరం అయిపోతుందని, ఇబ్బంది అవుతుందని 1968 ప్రాంతాల్లో హైదరాబాదుకే ఇల్లు, ఆఫీసు మార్చాం. అసలు మొత్తం హైదరాబాదు జీవితంలో 18 ఇళ్ళు మార్చి ఉంటాను. సరిగ్గా ఆ 1968 ప్రాంతాల్లోనే దేశ రాజకీయం, సామాజిక జీవనంలో లోతయిన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల ప్రభావం న్యాయవ్యవస్థ మీద, ఆలోచనా పరులందరి మీదా పెద్ద ఎత్తుననే కనబడడం మొదలయింది. అప్పటికే దేశ సమస్యల గురించి, ముఖ్యంగా దేశ విభజన, ద్రవిడ కజగం ఉద్యమం, తమిళనాడులోనూ, అంతకు ముందరి మద్రాసు రాష్ట్రంలోను రిగిన రాజకీయ పరిణామాలు, కేరళ ప్రభుత్వాన్ని పడగొట్టిన తీరు, దేశంలో పెరిగిపోతున్న అస్తవ్యస్తపాలన గురించి ఆలోచిస్తున్న నాకు జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగించాయి.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply