పురపాలక, పట్టణాభివృద్ధ్ది నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ నగరంలో రోడ్ల ఆధునికీకరణ చేశామన్న మంత్రి నగర అభివృద్దిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ నగరంలో రోడ్ల ఆధునీకరణ చేపట్టడం వంటి తదితర అభివృద్ధి చర్యలను పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి సంస్థ చేపట్టిందన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వార్షిక నివేదిక(2019-20)ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక నివేదికలోని ప్రగతికి సంబంధించిన పలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 పేరుతో ఈ ఏడాది నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకురావడం. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 139 పట్టణ స్థానిక సంస్థలకు ఈ చట్టం వర్తింపు. నూతన మున్సిపల్ చట్టం భారతదేశంలోనే ప్రగతిశీల చట్టంగా నిలిచింది.
స్వీయ ధృవీకరణతో ఆన్లైన్లో ఆస్తి పన్ను నమోదు వివరాలు తెలపడం, 240 గజాల స్థలం వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆన్లైన్లో తక్షణ అనుమతులు పొందడం వంటి వి ఇందులో ప్రధానంగా పేర్కొన్నారు. హైదరాబాద్ 69 కిలోటర్ల మేర మెట్రో రైలు సర్వీసులను అందుబాటులోకి తేవడం. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరమే అతి పెద్ద మెట్రో రైలు కనెక్టివిటీని కలిగిఉంది. హైదరాబాద్ ప్రజల అవసరార్థం 20 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం. 123 బస్తీ దవాఖానాల ఏర్పాటు. వీటితో పాటు మరో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 2020-21 ఏడాదిలో నగరంలో మొత్తం 350 బస్తీ దవాఖానాల ఏర్పాటు లక్ష్యం. నగరంలోని ఆరు జోన్లలో 500 పబ్లిక్ టాయిలెట్ల చొప్పున మొత్తం 3 వేల టాయిలెట్ల ఏర్పాటు చేశామని తెలిపారు. •ర్డింగ్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడం. ఇందుకోసం బస్ షెల్టర్లను, పబ్లిక్ టాయిలెట్లను వినియోగించడం. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఎంజే మార్కెట్ ఆధునీకరణ, యుద్ధప్రాతిపదికన ఫ్లై ఓవర్ల నిర్మాణం, మెట్రో ప్రతిపాదిత మూడు మార్గాల్లో రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవడం వంటి ఇతర చర్యలను చేపట్టనున్నారు.