అణగారిన వర్గాల గొంతుక కేసీ వేణుగోపాల్‌

– తెలంగాణలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం
– 2029లో రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
– అలప్ఫుళలో ఎంపీ మెరిట్‌ అవార్డుల కార్యక్రమంలో రేవంత్‌

అలప్పుళ, ఆగస్టు 31: పార్లమెంటు సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారని, అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు. తన నియోజకవర్గంతోపాటు కేరళ రాష్ట్రానికే కాక యావత్‌ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పాటుపడుతున్నారన్నారు. కేరళలోని అలప్పుళలో మెరిట్‌ విద్యార్థులకు కేసీ వేణుగోపాల్‌ అందించే ఎంపీ మెరిట్‌ అవార్డు-2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2006లో ప్రారంభించిన పొంథువల్‌ (ఎంపీ) మెరిట్‌ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉందని, 10, 12వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది వంద శాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500మందికిపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఈ అవార్డులు అందిస్తున్నారన్నారు. వంద శాతం అక్షరాస్యత కలిగిన ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి నియోజకవర్గం, రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించామని, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని చెప్పారు. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నాణ్యమైన విద్యనందించాలని సంకల్పించామని ఆయన వివరించారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఆనంద్‌ మహీంద్రాను చైర్మన్‌గా నియమించామని, ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేశామని, ఒలంపిక్స్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ వర్సిటీ, స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

రాష్ట్రంలో 2026లో జరిగే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించకండి.. అవి 2029లో దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలవుతాయి అని రేవంత్‌రెడ్డి అన్నారు. 2029లో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసే సంవత్సరంగా అందరికీ చాటుదామని యువతకు రేవంత్‌ పిలుపునిచ్చారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్‌ గాంధీ ఓటు హక్కు కల్పిస్తే బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ఓటు హక్కును కొల్లగొడుతున్నారని విమర్శించారు. 21 ఏళ్ల వయస్సులో ఐఏఎస్‌ కాగలగుతున్నపుడు యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు అని ప్రశ్నించారు. ఆ దిశగా రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత, యువతలోని శక్తిని నమ్ముకుని కాంగ్రెస్‌ పోరాటం సాగిస్తోందని రేవంత్‌ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *