ఢిల్లీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనా దోరణి మారినట్లు కనిపిస్తున్నది. నిన్నటి వరకు కేంద్రంతో నిప్పులో ఉప్పులా కొనసాగిన కేజ్రీవాల్ ఆదివారంనాడు మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే ఇక ఎంతమాత్రము కేంద్రంతో ఘర్షణవాతావరణాన్ని కలిగుండరాదన్న నిర్ణయానికొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక రాజకీయాలకు సెలవు అన్నమాటలు అదే అర్థాన్నిస్తున్నాయి. అందరినీ ఆశ్చర్యంలో ముంచిన మరో విషయమేమంటే నిత్యం ఘర్షణలు పడుతూ, కేంద్రాన్ని కడిగిపారేస్తూ వొచ్చిన కేజ్రీవాల్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించడం.
నరేంద్రమోదీ తన స్వంత నియోజకవర్గమైన వారణాసిలో అప్పటికే నిర్ణయమైన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్ళాల్సి ఉండడంతో రాకపోవడం వేరే విషయమైనప్పటికీ, తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానిని ఆహ్వానించినట్లు బహిరంగ సమావేశంలో ఆయన పేర్కొనడాన్ని, ఆ ఉత్సవానికి హాజరైన పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించిన అంశం. అంతటితోనే ఆయన ఆగలేదు. హస్తినను అభివృద్ధిపర్చే విషయంలో తనకు మోదీ ఆశిస్సులు కావాలని వేడుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. మనదేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు మీ సహకారం అవసరమంటూ, తాను సాధించిన అఖండ విజయం పట్ల తనకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ సందేశానికి బదులిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడం కూడా ఒకింత ఆశ్చర్యపర్చిన విషయమే. ఢిల్లీ సింహాసనాన్ని ఆమ్ ఆద్మీపార్టీ కైవసం చేసుకున్నప్పటి నుండి మొదట్లో కాంగ్రెస్‌తో ఆతర్వాత భారతీయ జనతాపార్టీతో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సివచ్చింది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమైతే ఆప్ ఎంఎల్ఏలను ఒకానొక సమయంలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కేజ్రీవాల్ పాలనాపరంగా తీసుకున్న అనేక నిర్ణయాలకు బిజెపి ప్రభుత్వం తీవ్ర ఆటంకాలను కలిగించింది. చివరకు పోలీస్ వ్యవస్థను కూడా ముఖ్యమంత్రికి సానుకూలంగా లేకుండా చేసిందన్న ఆరోపణలున్నాయి. దేశరాజధాని అయిన ఢిల్లీని తీర్చిదిద్దే విషయంలో ఆప్ తీసుకునే చర్యలకు కేంద్రం ఆటంకాలు కలిగిస్తున్నదని పలుసార్లు ఆప్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు సిఎం కేజ్రీవాల్ ఢిల్లీపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదంటూ పలుసార్లు విమర్శించిన సంఘటనలున్నాయి. జాతీయ రాజధానిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టాలనుకున్న ప్రాజెక్టులకు ఆర్థికసహాయం చేయడంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదంటూ గతంలో కేజ్రీవాల్ వాపోయిన సందర్భాలున్నాయి. అంతెందుకు ఒక దశలో ప్రధాని మోదీ తనను హత్యచేయిస్తారేమోనన్న అనుమానం వ్యక్తంచేస్తూ, ఒక వీడియోనే విడుదల చేసిన సందర్భం కూడా లేకపోలేదు. తనపై మోదీ భయంకరమైన కోపంతో ఉన్నాడని, ప్రశ్నించే తన గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నాడని, ఈవిషయంలో కార్యకర్తల భద్రతకు కరువేర్పడవచ్చని, అందుకు భయపడే కార్యకర్తలను పార్టీ వీడి పోవచ్చని బహిరంగంగానే ఆయన ప్రకటించారంటే వీరిద్దరి మధ్య ఎంతటి వైషమ్యాలున్నాయన్నది అర్థమవుతున్నది. మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని తాను అనుకోవడంలేదంటూ ఒకనాడు చెప్పిన కేజ్రీవాల్ ఇవ్వాళ ప్రమాణ స్వీకారోత్సవంలో మోదీతో స్నేహాన్ని కాంక్షిస్తున్నట్లు పలకడం వెనుక అర్థమేంటన్నది దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారింది. గడచిన మూడు ఎన్నికల్లో కూడా ఆయన అఖండ విజయాన్ని సాధించాడు. గడచిన రెండు ఎన్నిక)ను చూస్తే ఆప్ పార్టీకి ఢిల్లీ వోటర్లు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ డెబ్బై స్థానాలకుగాను కేవలం ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లోనూ, ఈ ఎన్నికల్లోనూ సున్నా స్థానాలను దాటిరాలేకపోయింది. ఈ అఖండ విజయానికి కేజ్రీవాల్ చేపట్టిన సంస్కరణలే కారణమన్న అభిప్రాయాలు లేకపోలేదు. 2013లో మొదటిసారి విజయం సాధించినప్పుడు కేవలం జన్‌లోక్‌పాల్ బిల్లు శాసనసభలో ఆమోదం పొందలేక పోయిందన్న ఒకే కారణంగా నలభైతొమ్మిది రోజులకే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న కేజ్రీవాల్ ఆతర్వాత చాలా పశ్చత్తాపపడ్డాడు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తన తొందరపాటుకు క్షమించమని ప్రజలను వేడుకున్నాడు. అదేంటోగాని ఢిల్లీ ప్రజలు ఆయనపై నమ్మకంతో గెలిపించినప్పటినుండి ఆయన నిరుపేద, మధ్యతరగతి ప్రజలకోసం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా మెప్పు పొందాయి. అవే ఆయన్ను మూడవసారి అఖండ విజయాన్ని చేకుర్చాయనడంలో అతిశయోక్తిలేదు. అందుకాయన కూడా తన ప్రమాణస్వీకారం రోజు తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కాకుండా, మీ కుమారుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాననడం ఢిల్లీవాసులను మరింతగా ఆకట్టుకుంది. అదే ఉత్సాహంగా ఆయన హమ్ హోంగే కామియాబ్ అన్న పాటను ఆసాంతం పాడటం, ప్రజలు కోరస్ కలపడం ఆయన వారి హృదయాలను ఏవిధంగా దోచుకున్నాడనడానికి అద్దంపట్టేదిగా ఉంది. ఇంత విజయం సాధించి, నిన్నటివరకు కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్ దోస్తీ కోసం కేంద్రానికి పిలుపునివ్వడం వెనుక అర్థాలను వెతుకుతున్నారు రాజకీయ దురందరులిప్పుడు.