సిఎం కేసీఆర్‌ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిఎం కుర్చీ నుంచి దిగిపోయేలోపు సంగారెడ్డికి ఇస్తానన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇవ్వాలనీ సంగారెడ్డి శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సిఎం కేసీఆర్‌ను మరోసారి కోరారు. ఈ మేరకు శనివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని రెండేళ్ల కింద సిఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ సిఎం పదవీ నుంచి దిగిపోయేలోపే మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్నారు. కేటీఆర్ సిఎం అయితే తండ్రి మాటను నెరవేరుస్తారో లేదోనన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా సిఎం కేసీఆర్ మారిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది, కేటీఆర్ సిఎం అయితే… కేసీఆర్ ఇచ్చిన మాట అమలు అవుతుందో లేదోనని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
కేటీఆర్ సిఎం అయితే… మెడికల్ కాలేజీ పంచాయతీ మొదటికి వస్తుందన్నారు. కేసీఆర్… ఇచ్చిన మాట నిలబెట్టుకోండన్నారు. మీ కొడుకు(కేటీఆర్) సిఎం కాకముందే సంగారెడ్డి మెడికల్ కాలేజీకి వెయ్యి కోట్లు ఇప్పించాలన్నారు. సిఎంగా కేసీఆర్ కుర్చీ దిగిపోయే నాటికి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయాలనీ కోరారు. లేదంటే ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ అనిపించుకుంటారో మీ ఇష్టం అని, తండ్రి ఇచ్చిన మాట అమలుకోసం కొట్లాడటానికే ఐదేండ్లు పట్టిందనీ, ఇక కేటీఆర్ సిఎం అయితే మళ్లీ ఎన్ని ఏండ్లు అవుతుందోనన్న భయం ఉందన్నారు. దీనికి తోడుగా ఈ ఏడాది పోతే జమిలి ఎన్నికలు అంటున్నారనీ, ఎన్నికలు వచ్చాయంటే మెడికల్ కళాశాల మళ్లీ వాయిదా పడుతుందన్నారు. ఈ ఏడాదిలోపే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని సిఎం కేసీఆర్‌ను జగ్గారెడ్డి కోరారు.