గాంధీ హాస్పిటల్లో కొరోనా ఇన్ పేషెంట్ల వినతి
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 21 : గాంధీ హాస్పిటల్లో చేరిన కొరోనా పేషెంట్లకు హెల్దీ ఫుడ్ అందట్లేదన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. స్పెషల్ డైట్‌ను 2 నెలల క్రితమే అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం గాంధీలో అడ్మిట్ అవుతున్న కొరోనా పేషెంట్లకు కూడా సాధారణ డైట్ అందిస్తున్నారు. ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వకపోతే తొందరగా ఎలా రికవరీ అవుతామని పేషెంట్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ వేవ్ టైమ్‌లో 2020 జులై 15 నుంచి కొరోనా పేషెంట్లకు ఇమ్యూనిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. రైస్, చికెన్, చపాతీలు, బాదామ్, పిస్తా, ఎగ్స్, ఇడ్లీ, పాలు, ఉప్మా ఇలా..ఏ పూటకు ఆ పూట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో కొరోనా వార్డుల్లోని పేషెంట్లకు హెల్దీ ఫుడ్‌ను అందించేవారు.
సెకండ్ వేవ్ టైమ్ లోనూ దీన్నే కొనసాగించారు. ఆ తర్వాత కొరోనా కేసులు తగ్గడంతో 2 నెలల క్రితం అధికారులు స్పెషల్ డైట్ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీలో ప్రస్తుతం 160 మంది కొరోనా పేషెంట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కానీ వారికి స్పెషల్ డైట్ అందించే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం పప్పు, అన్నం,కూర, పెరుగు మాత్రమే ఇస్తున్నారని, ఇలాంటి ఫుడ్‌తో తాము రికవరీ కావడం ఎలా అని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొరోనా స్పెషల్ డైట్‌ను మళ్లీ అమలు చేయాలని కోరుతున్నారు.