Take a fresh look at your lifestyle.

కీచక భారతం

చట్టాలెన్ని దట్టించినా
కలియుగ కీచక పర్వాలు
ఇంకా సాక్షాత్కరిస్తున్నాయ్‌

‌కఠిన శిక్షలెన్ని విధించినా
మరిన్ని మానవ మృగాలు
స్వైర విహారం చేస్తున్నాయ్‌

‌షీటీమ్స్, ‌ఫాస్ట్రాక్‌ ‌కోర్టులు
క్రియాశీలకంగా  మెదిలినా
మదగజాలు పెట్రేగుతున్నయ్‌

ఈ ‌భారతావనిలో…
అతివ జీవిత గతి తీరు
గడియ గడియకు గండం
గడప దాటితే అగ్నిగుండం

పసిమొగ్గ మొదలుకొని
చావుకు చేరువైన వృద్ధను
వదలక చెరిచే పైశాచికత్వం

కామ సెగలు చల్లార్చ
ఆడ మాంసం ముద్దైతే
చాలనుకునే కీచకతత్వం
వెరసి అ(హ)త్యాచారాలు
హింసలు సజీవ దహనాలు
నిత్యం వెలుగుచూస్తున్నాయ్‌

ఈ ‌విష సంస్కృతి విస్తరిస్తే
‘‘అమ్మ’’తనాలు మాయం
మనిషి మనుగడ శూన్యం
జగతి అందకార బంధురం

అందుకే ఇకనైనా…
సమాజం కళ్ళు తెరిచి
కలికీచకుల కడతేరిస్తేనే
స్త్రీజాతికి విముక్తి కలిగేను
బాపూజీ స్వప్నం నెరవేరేను

(కొత్తగూడెంలో రేపిస్ట్ ‌వేటుకు బలైన అభాగ్యురాలికి బాసటగా…)

– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply