హైదరాబాద్, ఆగస్టు 9 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): మోసపూరిత మాటలు, కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ సర్కారు మారిపోయిందనీ బిజెపి పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ మండిపడ్డారు. సోమవారం ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బతకడం ఒక శాపమని రోదిస్తున్నారనీ, మనది ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పి అప్పుల కుప్పగా మార్చేశారనీ ఆరోపించారు.. ఇప్పుడు చూస్తే ప్రతి నెలా 1వ తేదీకల్లా రావలసిన జీతాలు, పెన్షన్లు పది రోజులవుతున్నా అందని దుస్థితికి తీసుకొచ్చారనీ, ఆయా జిల్లాలకు రొటేషన్ పద్ధతిలో ముందు, వెనకలుగా జీతాలు సర్దుబాటు చేస్తూ దాదాపుగా గత 6 నెలల నుంచీ ఇదే పరిస్థితి నెలకొందని మీడియాలో కథనాలు, డిబేట్లు నడుస్తూనే ఉన్నా సర్కారులో చలనం లేదన్నారు.
రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో సేవలందించే వారి సంగతి చెప్పాల్సిన పనిలేదనీ, ఇది చాలక మరో పక్క బిల్లులు క్లియర్ కావడంలేదని కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారన్నారు. ఉద్యోగుల ధీనస్థితి ఇలా ఉంటే… మరోవైపు ప్రయివేటు ఉపాధ్యాయుల వేదన మిన్నంటుతోందనీ, విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలయ్యే వరకూ ప్రయివేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు…. 3 నెలలు దాటాక వారిని మర్చిపోయినట్టుందన్నారు. జూలై నెల సహాయం ఇంకా అందలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అరకొర సాయాలతో తమకు ఒరిగేదేం లేదని ప్రయివేట్ స్కూళ్ల టీచర్లు వాపోతున్నారనీ, ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలను ‘బంధు’వులుగా చూస్తూ…. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కోట్లాది రూపాయల్ని వెదజల్లే ఈ పాలకులకు రాష్ట్రంలోని మిగిలిన పౌరులు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదనీ విజయశాంతి ఆ పోస్టులో పేర్కొన్నారు.