- స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం
- రచ్చబండకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం
- రాష్ట్ర ప్రభుత్వంపై సిఎల్పి నేత భట్టి విక్రమార్క మండిపాటు
- రేవంత్ రెడ్డి తదితరుల అరెస్ట్‌పై ఆగ్రహం
- నిరంకుశ విధానాలతో పాలించలేరు : కాంగెస్ ఎంపి ఉత్తమ్
- రాష్ట్రంలో పోలీస్ రాజ్యం : పోలీసుల తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
ప్రజాతంత్ర, హైదరాబాద్ : దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండా అడ్డుకోవడం, పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదన్నారు. టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనపై ఇక తెలంగాణ ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పోలీసులతో నిర్బంధం ప్రయోగించి భావవ్యక్తీకరణ ఆపాలనుకోవడం సర్కార్ పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన కేసీఆర్ సర్కారు చర్యను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. పోలీసులు హౌస్ అరెస్టు చేస్తే వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా అని ప్రశ్నించారు. ధర్నాల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్దతి అని టిఆర్ఎస్ సర్కార్‌ను నిలదీశారు. రచ్చబండకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిఆర్ఎస్ ధర్నాలను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దని ఏ రాష్ట్ర సర్కార్ చెప్పలేదన్నారు.
మొట్ట మొదటిసారిగా తెలంగాణ సర్కార్ చేతగానితనంతో వరి వేస్తే ఉరి అని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలని, ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. కానీ, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతులపై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నీటి వనరులతో రైతులు వరి పంటలు పండిస్తారని, యాసంగిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, అన్నదాతలు అధైర్యపడొద్దని, ధాన్యం కొనుగోలు చేయకుంటే కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని ప్రకటించారు.
నిరంకుశ విధానాలతో పాలించలేరు : కాంగెస్ ఎంపి ఉత్తమ్
కాంగ్రెస్ రచ్చబండను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పిసిసి చీఫ్ రేవంత్ తదితరులను అరెస్ట్ చేసి ఎర్రవెల్లికి పోకుండా చేసిన నేపథ్యంలో ఉత్తమ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో బందీ అయ్యిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా ప్రజలు కేసీఆర్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దేవరకొండ ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకొని పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ ఎక్కడ..అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. రైతులు వరి పంట వేయొద్దని చెబుతున్న సీఎం కేసీఆర్ స్వయంగా తన పొలంలో వరి పండిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అణిచివేస్తే తెలంగాణ వొచ్చేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం : పోలీసుల తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందా..లేదంటే ప్రజాస్వామ్యం నడుస్తుందా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీఆర్ఎస్, బీజేపీ వీధి నాటకాలు అడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి అని చెప్పలేదని మల్లు రవి పేర్కొన్నారు. కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారు అని తాము చెప్పామని.. కానీ ముట్టడి అని ప్రకటన చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టాల్సిన భాద్యత పోలీసులపై ఉందన్నారు.
పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీ లాగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే కాంగ్రెస్ నేతల అరెస్ట్‌పై మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మండిపడ్డారు. సోమవారం బాగ్ అంబర్ పేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి రాష్ట్రంలో బీజేపీకి ఓ న్యాయం కాంగ్రెస్‌కు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఏకమై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
యాసంగి పంట విషయంలో కేసీఆర్‌కు ఓ న్యాయం రైతులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. యాసంగి పంట పూర్తిగా కొనుగోలు చేసేంతవరకు రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎప్పుడు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగ్గారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పులేదనే సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.