చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది..
బిజేపి విజయం ఖాయం
ఈటల రాజేందర్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో గురువారం జరిగిన చేవెళ్ల బహిరంగ సభ సన్నాహక సమావేశంలో పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ…అందులో భాగంగా చేవెళ్ల నియోజకవర్గానికి విచ్చేస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోయిందని పేర్కొంటూ తన మాట వినని, ప్రలోభాలకు లొంగని బీజేపీ కార్యకర్తలపై సీఎం కేసీఆర్ వేధింపులకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులను సైతం వేధింపులకు గురిచేస్తుండటం కేసీఆర్ దుర్మార్గాలకు పరాకాష్ట అని, కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎన్ని ఎక్కువ వోట్లు వస్తే ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీల్చవచ్చని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌పై ఈగ వాలినా కేసీఆర్ స్పందిస్తూ వెనుకేసుకొస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులకు వోటేస్తే అది బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపేనిచ్చారు. చేవెళ్ల సభను సక్సెస్ చేయడం ద్వారా బీజేపీ తెలంగాణకు అడ్డగా నిరూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చేవెళ్లలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు ఖాయమని, బహిరంగ సభకు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఈటల తెలిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…లక్ష మందితో చేవెళ్ల బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేసి తీరుతామని, చేవెళ్ల పార్లమెంట్ సీటును బీజేపీ కైవసం చేసుకోవడం ఎప్పుడో ఖాయమైందని, కేసీఆర్ సర్కార్ పోవాలంటే చేవెళ్ల పార్లమంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను బీజేపీ గెలవాల్సిందేనని అన్నారు. తక్కువ సమయమున్నా చేవెళ్ల బహిరంగ సభ విజయవంతం చేసి తీరుతామని అన్నారు.