Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌కేంద్రం పై పోరాడతారట.. నమ్ముదామా ..!

‘‘‌జాతి నిర్మాణం సక్రమంగా జరగాలంటే అధికారాల విషయంలో కేంద్రం వైపు కాస్త మొగ్గు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. నరేంద్ర మోదీ, అమిత్‌ ‌షా వంటి నాయకులు దేశాన్ని పాలిచేందుకు వస్తారని వారు ఆనాడు ఊహించలేకపోయారు. ఆ మొగ్గును ఆసరాగా తీసుకుని రాష్ట్రాలతో చెడుగుడు ఆడుకునే పాలకులు పుట్టుకు వస్తారని వారికేం తెలుసు. ప్రస్తుత పాలకుల విధానాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలే. దీనిని ఎదుర్కొనే దారి పోరాటం ఒక్కటే. ఎన్ని రకాలుగా పోరాడగలిగితే అన్ని రకాలుగా పోరాటమే. కేంద్రంలోని పెద్దల దగ్గరకు వెళ్లి చేతులు నలుపుకోవడం కాదు. కెసిఆర్‌ ‌లాంటి నాయకుడు..ప్రాంతీయవాదం బలంగా వినిపించి, దశాబ్ద కాలం పైగా ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించగలిగిన నాయకుడు.. ఈ పోరాటానికి నిజానికి నాయకత్వం వహించగలిగిన స్థాయి ఉన్న వాడు. కానీ తాత్కాలిక రాజకీయాల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నాలుక మడత వేస్తూ విశ్వసనీయతను కోల్పోయారు. దురదృష్టం..!’’

మొన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అకస్మాత్తుగా యూనియన్‌ ‌ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటున్నదని విమర్శించారు. పంచాయితీలకు కూడా కేంద్రమే నేరుగా నిధులు ఇస్తే ఇక స్థానిక పాలన అర్ధం ఏమిటి అని నిలదీశారు. అత్యధికంగా జిడిపి సాధించే మొదటి నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేంద్రానికి వెళుతున్నాయి. తిరిగి వస్తున్నది మాత్రం తక్కువ అన్నారాయన. హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు కావాలని ప్రధానికి, అప్పటి పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడుకూ తాను ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాననీ, ప్రయోజనం లేకపోయిందనీ ఆయన వాపోయారు. ఈ ఆగ్రహ ప్రదర్శనకు శాసనసభను వేదికగా ఎంచుకున్నారు. నిజమే.. రాష్ట్రాల అధికారాలను మోదీ నేతృత్వంలోని యూనియన్‌ ‌ప్రభుత్వం క్రమేపీ కబ్జా పెడుతోంది. కానీ కెసిఆర్‌ ‌కు ఇప్పుడే తెలిసిందా ఏమిటి ఈ విషయం..?

ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడేళ్లు దాటింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాలను ఏకం చేస్తానని కెసిఆర్‌ ‌రెండు సార్లు గర్జించారు. ఆ దిశగా చేసిందేమీ లేదు. మిగతా రాష్ట్రాలు కలిసిరాకపోతే పాపం కెసిఆర్‌ ఏం ‌చేయగలరు అని మీరు అనొచ్చు. నిజమే..! కనీసం తనవరకూ తాను గట్టిగా నిలబడవచ్చుగా.. కేంద్రం పెత్తందారీ ధోరణిని ఎప్పటికప్పుడు నిలదీయవచ్చుగా .. మిగతా ముఖ్యమంత్రులకు కనువిప్పు కలిగి కలిసివస్తారేమో… ఆ పని చేయలేదు సరి కదా..మధ్య మధ్యలో అకస్మాత్తుగా యూనియన్‌ ‌ప్రభుత్వంలోని పెద్దలతో అత్యంత సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. గతానుభవాల దృష్ట్యా మొన్నటి ఆయన మాటలను కూడా విశ్వసించడానికి జనం సిద్ధంగా లేరు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం కేంద్రంలోని బీజెపి ప్రభుత్వం పెత్తందారీతనం గుర్తుకువచ్చిందేమో.. ఎవరికి తెలుసు..!

మోదీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకించారు బాగానే ఉంది. ముందు వాటికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ‌లో వోటు చేశారు సరే. మరి మొన్న భారత్‌ ‌బంద్‌ ‌కు ఎందుకు మద్దతు ప్రకటించలేదు..? మెడికల్‌ ‌కళాశాలల సీట్ల భర్తీకి దేశవ్యాప్త ఎంట్రన్స్ ‌నీట్‌ ‌ప్రవేశపెట్టడం ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధం. తెలంగాణ కూడా వ్యతిరేకించింది. కానీ దానిపై పోరాడడం లేదు. నీట్‌ ‌నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్టాలిన్‌ ‌ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్‌ ‌చేయించింది. నీట్‌ ‌పై కేంద్రంలో పోరాటానికి కలసి రావల్సిందిగా స్టాలిన్‌ ‌నాన్‌ ‌బీజెపి ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను కోరుతుతున్నారు. మాది కూడా అదే వైఖరి అంటూ శాసనసభలో కెసిఆర్‌ ‌కూడా ఒక తీర్మానం పాస్‌ ‌చేయించవచ్చుగా..! మొన్న మే నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులతో వర్చువల్‌ ‌సమావేశం ఒకటి నిర్వహించారు. 2020 సంవత్సరం జాతీయ విద్యావిధానం సవరణలు ఆ సమావేశం ఏజెండా. దీనికి మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించాలని తమిళనాడులోని స్టాలిన్‌ ‌ప్రభుత్వం కోరింది. కేంద్రం కుదరదంది. దానితో స్టాలిన్‌ ‌ప్రభుత్వం విద్యా విధానం గురించి మా కార్యదర్శులతో మీరేంటి మాట్లాడేది. అసలు వచ్చేదే లేదు పొండని ఆ సమావేశాన్ని బాయి కాట్‌ ‌చేశారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేపోయింది..?

వ్యవసాయం, విద్య రాష్ట్రాల సబ్జెక్టులు. వాటిలో కేంద్రం వేలు పెట్టి పెత్తనం చేస్తున్నది. ఊరుకుంటే రేపో మాపో మొత్తం ఆక్రమిస్తుంది. ఆక్రమించడమే వారి లక్ష్యమనీ..ఫెడరల్‌ ‌వ్యవస్థ పట్ల కేంద్రం లో సర్కారు నడుపుతున్న వారికి గౌరవం, భక్తీ లేనేలేవనీ కాకలు తీరిన రాజకీయవేత్త కెసిఆర్‌ ‌కు తెలియదా..? తెలుసు.. ఇదొక్కటేనా..ఇంకా చాలా ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తోంది. ఆల్మోస్ట్ ‌బ్లాక్‌ ‌మెయిల్‌ ‌కు దిగుతోంది. రాజ్యసభ రాష్ట్రాల సభ. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా చట్టాలు చేసే విషయంలో రాష్ట్రాల గొంతు వినిపించడం..అవసరమైతే తాత్కాలికంగా నయినా బ్రేక్‌ ‌వేయడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఆ సభ పెట్టారు. అలాంటి సభను మోదీ ప్రభుత్వం బైపాస్‌ ‌చేస్తున్నది. అన్ని కీలకమైన బిల్లులకూ ద్రవ్య బిల్లు ముద్ర వేసి రాజ్యసభ ఆమోదం ఆవసరం లేని పరిస్థితి కల్పిస్తున్నది. జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలను బిచ్చగాళ్ల స్థాయికి దించారు. నిధుల కోసం దేబిరించాల్సిన పరిస్థితి. నిధులు, ప్రభుత్వాలకు ఆదాయం పోగయ్యేదే రాష్ట్రాల దగ్గర. వాటిలో న్యాయమైన భాగం పొందడం రాష్ట్రాల హక్కు. కానీ మోదీ ప్రభుత్వం వ్యవహారం అలా లేదు. తామేదో దయతలిచి నిధులు ఇస్తున్నట్లు పోజు పెడుతున్నారు.

మన రాజ్యాంగం.. కేంద్రానికి రాష్ట్రాలపై ఆధిపత్యం ఏమీ కల్పించడం లేదు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య..యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్ అనే రాజ్యాంగం చెబుతోంది. భిన్న మతాలకూ, జాతులకూ, సంస్కృతులకూ నిలయమైన ఇండియా.. వలస పాలన నుంచి విముక్తం అయి స్వతంత్ర దేశంగా అవతరించినపుడు ఆ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..కొత్తగా స్వయంపాలన ప్రారంభించిన దేశంలో.. జాతి నిర్మాణం సక్రమంగా జరగాలంటే అధికారాల విషయంలో కేంద్రం వైపు కాస్త మొగ్గు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. నరేంద్ర మోదీ, అమిత్‌ ‌షా వంటి నాయకులు దేశాన్ని పాలిచేందుకు వస్తారని వారు ఆనాడు ఊహించలేకపోయారు. ఆ మొగ్గును ఆసరాగా తీసుకుని రాష్ట్రాలతో చెడుగుడు ఆడుకునే పాలకులు పుట్టుకు వస్తారని వారికేం తెలుసు. ప్రస్తుత పాలకుల విధానాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలే. దీనిని ఎదుర్కొనే దారి పోరాటం ఒక్కటే. ఎన్ని రకాలుగా పోరాడగలిగితే అన్ని రకాలుగా పోరాటమే. కేంద్రంలోని పెద్దల దగ్గరకు వెళ్లి చేతులు నలుపుకోవడం కాదు. కెసిఆర్‌ ‌లాంటి నాయకుడు..ప్రాంతీయవాదం బలంగా వినిపించి, దశాబ్ద కాలం పైగా ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించగలిగిన నాయకుడు.. ఈ పోరాటానికి నిజానికి నాయకత్వం వహించగలిగిన స్థాయి ఉన్న వాడు. కానీ తాత్కాలిక రాజకీయాల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నాలుక మడత వేస్తూ విశ్వసనీయతను కోల్పోయారు. దురదృష్టం..!

 

Leave a Reply