- దౌర్జన్యాల్లో తెలంగాణ నంబర్ వన్
- వరంగల్ పర్యటనలో ఈటల రాజేందర్ విమర్శలు
వరంగల్,ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికార మదం తలకెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంక్షేమం మరిచి కేసీఆర్ నియంతలా పరిపాలిస్తున్నారని, కేసీఆర్ పాలనలో దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగాయని ఈటల ఆరోపించారు. సీఎం కేసీఆర్ దోపిడీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని ఈటల హెచ్చరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఈటల రాజేందర్ పర్యటించారు. రెండవసారి ఓటు వేసిన తర్వాత కేసీఆర్కు కళ్లు నెత్తికి ఎక్కాయని, ప్రజలను మర్చిపోయి చక్రవర్తిలాగా, రాజులాగా పరిపాలిస్తున్నాడని మండిపడ్డారు.
వేధించడం, డబ్బులు వసూలు చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పం కేసీఆర్కు లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నెంబర్ వన్ అంటారని, నిజమే దౌర్జన్యాల్లో నెంబర్ వన్ అని, ప్రజలను కలవకుండా ఉండటంలో కేసీఆర్ నెంబర్ వన్ అని ఈటల ఆరోపించారు. ప్రభుత్వపరమైన ఆస్తులను ఆక్రమించుకోవడంలో నెంబర్ వన్ అని, దళితులకు ఏనాడో ఇచ్చిన భూములను గుంజుకోవడంలో నెంబర్ వన్ అని అన్నారు. ధరణి అని పెట్టి తన భూములు ఉంటాయో పోతాయో అనే బెంగ పడేలా చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని ఈటల రాజేందర్ అన్నారు.