- కాళేశ్వరం మోటార్లకు ఈతెందుకు నేర్పలేదు..?
- తెలంగాణ కల్వకుంట్ల జాగీరా? పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికేనా?
- ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్నా బిజెపితోనే సాధ్యం
- బిజెపి జెండాను చూస్తేనే టిఆర్‌ఎస్‌కు గజగజ
- క్లౌడ్ బరస్ట్‌తో అంతర్జాతీయ జోకర్‌గా మారిన కేసీఆర్
- కేసీఆర్ విచారణను ఎదుర్కునక తప్పదు
- సిద్ధిపేట జిల్లాలో జనం గోస-బిజెపి భరోసా యాత్రను ప్రారంభించిన బిజెపి చీఫ్ సంజయ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 21 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కుమారుడు కేటీఆర్ అపర భగీరథుడు, నదులకు నడక నేర్పిండు అంటున్నడు. నదులకు నడక నేర్పినోడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లకు ఈత ఎందుకు నేర్పలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లకు ఈత నేర్పితే ప్రజలకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అని సిఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బిజెపి చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్య అస్త్రాలను సంధించాడు. సంచలన వ్యాఖ్యలు చేశారు. నదులకు నడక నేర్పిన సిఎం కేసీఆర్ కాళేశ్వరంలోని మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేదనీ, నేర్పితే అవి వర్షాలకు మునగకుండా పైకి తేలేవి కదా? లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నీటిలో మునిగిపోవడాన్ని గుర్తు చేస్తూ బండి పై విధంగా స్పందించారు. ‘జనం గోస-బిజెపి భరోసా’ యాత్రలో భాగంగా గురువారం సిద్ధిపేట జిల్లా నాంచార్‌పల్లిలో బిజెపి చీఫ్, ఎంపి బండి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి మురళీధర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులడు దూది శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్‌రెడ్డి, సిద్ధిపేట అర్భన్ అధ్యక్షుడు పూరుమాండ్ల నరసింహారెడ్డి తదితరులతో కలిసి బైక్ నడుపుతూ నాంచార్‌పల్లి, బక్రిచెప్యాల వరకు ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామి ఆశీస్సులు అందుకున్నారు. దారి పొడవునా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌కు ఎదురొచ్చి గోడు వెళ్లబోసుకున్న ప్రజలకు ‘మీరు బాధపడకండి. ప్రధానమంత్రి మోదీ మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని భరోసా ఇవ్వాలని నన్ను ఇక్కడికి పంపారు. బిజెపి మీకు అండగా ఉంటుంది. రాబోయేది బిజెపి పార్టీ ప్రభుత్వమే. పార్టీ అధికారంలోకి రాగానే మీ కష్టాలన్నీ తీరుస్తాం’ అంటూ ముందుకు కదిలారు. బక్రిచెప్యాలలో గొల్ల కుర్మలు గొర్రె పిల్లలను బండి సంజయ్‌కు బహుకరించారు. గ్రామంలో ప్రజలను కలిసి వారి పడుతున్న బాధలను తెలుసుకున్నారు. అంతకుముందు నాంచార్‌పల్లిలో బిజెపి చీఫ్ బండి, జాతీయ నాయకుడు మురళిధర్‌రావును అర్భన్ అధ్యక్షుడు పురుమాండ్ల నర్సింహారెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. నాంచార్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
సిఎం హోదాలో కేసీఆర్ చేసిన అక్రమాలు బయటకు వొస్తాయి. ఆయనపైనా కేసులు గ్యారంటీగా నమోదవుతాయి. అప్పుడు కేసీఆర్ కూడా, సిబిఐ, ఈడీ విచారణ ఎదుర్కునక తప్పదని తెలుసునన్నారు. సిఎం కేసీఆర్ ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరుతో 30 వేల కోట్ల రూపాయతో నిర్మాణం కానున్న కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి కట్టి ఊళ్లకు ఊళ్లను ముంచేసిండని ఆరోపించారు. కొరోనా టైంలో డాక్టర్ అవతారమెత్తిండు. కొరోనా వొస్తే పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రమే వేసుకోమ్మని చెప్పి ఫామ్ హౌజ్‌లో పడుకున్నడన్నాడు. ఇప్పుడు వానలు పడంగనే వాతావరణ శాఖ శాస్త్రవేత్త అవతారమెత్తిండు. ‘క్లౌడ్ బరస్ట్’పేరిట తెలంగాణను దెబ్బకొట్టడానికి విదేశీ శక్తులు కుట్రలంటున్నాడనీ, ఈయన మాటలు చూసి పార్లమెంట్‌లో ఎంపీలంతా నవ్వుకుంటున్నారనీ, కేసీఆర్ అంతర్జాతీయ జోకర్‌లా మారిండన్నాడు. కేసీఆర్ మామూలోడు కాదు…దేశ్ కీ నేత…దిన్ బర్ పీత… మోడీ పే రోత…ఫామ్ హౌజ్ మే సోతా…అమాస, పున్నమికి బాహర్ ఆతా…అంటూ ధ్వజమెత్తాడు. అప్పులపాలైన తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా… సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా…ఫస్ట్ తారీఖున ఠంచన్‌గా ఉద్యోగులకు జీతాలు రావాలన్నా బిజెపి పార్టీ అధికారంలోకి వొస్తేనే సాధ్యమన్నాడు. టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నిండా అప్పుల పాలుజేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయనీ, ఇదేమైనా కల్వకుంట్ల జాగీరా? అని ప్రశ్నించారు. జనం ఇల్లు, రేషన్ కార్డుల్లేక సమస్యలతో అల్లాడుతుంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రం లక్షల కోట్లు దోచుకుంటూ లండన్, మస్కట్, దుబాయి దేశాల్లో దాచుకుంటోందనీ ఆరోపించారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిండన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క తలపై రూ.1.20 లక్షల అప్పు భారం మోపిండనీ, శ్రీలంకలో కూడా ఇట్లనే ఒకే కుటుంబం పాలించి దోచుకోవడంవల్ల ఆ దేశ ప్రజలు అడుక్కు తింటున్నారన్నారు. ఈ విషయాలన్ని చెప్పి ప్రజలను చైతన్య పర్చేందుకే ఈ యాత్ర చేస్తున్నామనీ, ప్రజల బాధలు తెలుసుకుని భరోసా ఇచ్చేందుకే బైక్ ర్యాలీ అన్నారు. రైతులకు రుణమాఫీ అమలు చేయలేదనీ, రైతుల అకౌంట్లో ఉన్న సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నాడనీ, కేసీఆర్ నిర్వాకంవల్ల లక్షల ఎకరాల పంట నష్టపోయారనీ, నెపాన్ని మాత్రం కేంద్రంపైన నెడుతున్నాడనీ, నష్టపోయిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలని బండి డిమాండు చేశారు.
సిద్ధిపేట ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలే…
సిద్ధిపేట ప్రజలకు ఒక విషయంలో శుభాకాంక్షలు చెప్పాలే… ఎందుకంటే ఎనిమిదేళ్లుగా సెక్రటేరియట్ వెళ్లకుండా ఇక్కడికి దగ్గర్లోనే ఫామ్ హౌజ్ నుండి పాలన చేస్తున్న ఏకైక సిఎం కేసీఆర్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. సిఎం కేసీఆర్ దగ్గర ఇంకో గొప్ప విషయం ఉందనీ, ప్రపంచంలో ఏదో ఒక రంగంలో మాత్రమే శాస్త్రవేత్తలు, నిపుణులు ఉంటారు. కానీ, మన సిఎం ఒకటి, రెండు కాదు…100 రంగాల్లో నిపుణుడన్నాడు. సిద్ధిపేట జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడి కేసీఆర్‌ను పెంచి పెద్ద చేస్తే ఏమిచ్చిండని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు ఇయ్యలే..కొత్త రేషన్ కార్డు ఇయ్యలే.. కొత్తగా పెన్షన్ ఇయ్యలే.. ఇక్కడే 8 ఏండ్ల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల గోస పుచ్చుకుంటున్నాడనీ, యువకులకు ఉద్యోగాలియ్యలే… ఉన్న ఉద్యోగాలు పాలిట శనిలా దాపురించిండన్నాడు. కేసీఆర్‌కు మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుకు ఏడాది పాటు మంత్రి పదవీ ఇవ్వకుండా అవమానించాడనీ, అధికారులెవ్వరూ ఒక్క పని కూడా అల్లుడికి చేసిపెట్టొద్దని చెప్పిండనీ, ఏవేవో పూజలు చేస్తున్నాడనీ భయపడి పిలిచి మళ్లీ మంత్రి పదవీ ఇచ్చాడన్నారు. అప్పటి నుండి నోరు తెరిస్తే అల్లుడి నోటి నిండా అబద్దాలే వస్తున్నాయనీ,. పదవీ కోసం ఇన్ని అబద్దాలు ఆడటం అవసరమా?అని నిలదీశారు. గ్రామాలలో బిజెపి నేతలు తిరుగుతుంటే, బిజెపి జెండాలను చూసి టిఆర్‌ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారనీ, దాడులు చేసి భయపెట్టాలనుకుంటున్నారనీ, టిఆర్‌ఎస్ బెదిరింపులకు, పోలీసుల కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధనే మా లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా పోరాడతాం. ఆ భరోసా కల్పించేందుకే యాత్ర చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదు…
కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదునీ, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కొల్లగొట్టిన కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారణకు పిలిస్తే ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారనీ, అదేమైనా ప్రజా సమస్యనా?అని బండి ప్రశ్నించారు. గతంలో మోదీ, అమిత్ షాలపై ఆరోపణలొస్తే విచారణకు హాజరై కడిగిన ముత్యంలా బయటకు వొచ్చారే తప్ప…కాంగ్రెస్ నేతల వలే ఆందోళనలు, ధర్నాలు చేయలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ తప్పు చేయకుంటే ఈడీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? దమ్ముంటే విచారణకు హాజరై నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. రేపు కేసీఆర్ అక్రమాలు బయటకు వస్తాయి. ఆయనపైనా కేసులు గ్యారంటీగా నమోదవుతాయి. అప్పుడు కేసీఆర్ కూడా ఈడీ విచారణ ఎదుర్కొక తప్పదని తెలుసు. ఈడీ విచారణను అడ్డుకోవడమెలాగనే దానిపై కాంగ్రెస్‌తో ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారనీ, బిజెపి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడుతుంటే… కాంగ్రెస్ మాత్రం బిజెపికి పోటీగా కార్యక్రమాలు చేస్తుండటం సిగ్గు చేటన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారనీ, ఆ పార్టీ వోటు బ్యాంకు మొత్తం బిజెపి వైపు మళ్లుతుందనీ, దేశంలో మోదీ మరో 20 ఏళ్లపాటు అధికారంలోకి ఉంటారని టిఆర్‌ఎస్ స్ట్రాటజిస్టే చెబుతున్నాడనీ బిజెపి చీఫ్ బండి అన్నారు.