‘‘రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీల జాడే కరువై పోయింది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ ధాటికి జాతీయపార్టీలు తట్టుకోలేకపోయాయి. తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం తామంటే తామంటూ విస్తృత ప్రచారం చేసుకున్న ఈ పార్టీలను వోటర్లు పెద్దగా ఆదరించలేదు. అధికారపార్టీ వైఖరిని దుయ్యబడుతూ ఈ పార్టీలు గత కొంతకాంగా చేసిన ప్రచారాన్ని ప్రజలేమాత్రం పట్టించుకోలేదు…ఫలితంగా అత్యధిక స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాల్టీలకుగాను అధికార టిఆర్ఎస్ 109 మున్సిపాల్టీలను గెలుచుకోగా, కాంగ్రెస్ నాలుగు మున్సిపాల్టీలను, భాజపా మూడు, ఇతరులు నాలుగు మున్సిపాల్టీలను గెలుచుకోగా మరో రెండింటిని ఎంఐఎం గెలుచుకుంది. కాగా తొమ్మిది కార్పోరేషన్లకుగాను టిఆర్ఎస్ ఎనిమిదింటిని కైవసం చేసుకుంది.‘‘
- జాడ కరువయిన జాతీయ పార్టీలు..
- రుజువు చేసిన మున్సిపల్ ఫలితాలు…
- గుబాళించిన గులాబీ మున్సిపల్ ఎన్నికలలో అఖండ విజయం కట్టబెట్టిన వోటర్లు
- ఎన్నిక ఏదైనా తిరుగులేదని నిరూపించిన టిఆర్ఎస్
- ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్, బిజెపి – ఫలించిన కెసిఆర్ ఆదేశాలు..కెటిఆర్ వ్యూహాలు
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ గుబాళించింది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో .. టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే చేసే ప్రకటన నిజమేనని పట్టణ ఓటర్లు మరోసారి నిరూపించారు. . కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన టీఆర్ఎస్.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. కారు వేగానికి బ్రేక్ లేదని పట్టణ ప్రజలు కూడా తేల్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు అనుకూలంగా రావడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎన్నికలు జరిగిన మొత్తం 120 మున్సిపాల్టీల్లో 109 స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ 4, బీజేపీ 3, ఇతరులు నాలుగు• స్థానాలలో విజయం సాధించారు. అలాగే, ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో 8 స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించగా, ఇతరులు ఒక స్థానంలో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. కెటిఆర్ వ్యూహం, కెసిఆర్ దిశానిర్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉమ్మడి కృషి ఫలితంగా ఫలితాలు అనుకూలంగా రాబట్టారు. ఫలితాల తీరు టిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. మంత్రుల ఇలాఖాల్లో తిరుగులేకుండా పోయింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, పాలమూరు తదితర జిల్లాల్లో పట్టు సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అధికార టీఆర్ఎస్ పట్టు సాధించడం విశేషం. మున్సిపాల్టీల్లో దాదాపు 90 శాతం వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, జనవరి 22న జరిగిన మున్సిపల్ ఎన్నికలు జరగగా శనివారం కౌంటింగ్ చేపట్టారు. అయితే ఫలితాలకు ముందే అభ్యర్థులు 81 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. దాంట్లో టీఆర్ఎస్ వారే 78 మంది ఉన్నారు. చెన్నూరు, వర్థనపేట, సూర్యాపేట, పరకాల మున్సిపాల్టీల్లో దాదాపు టీఆర్ఎస్ హవా కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ఓటర్లను ఆకర్షించాయని రుజువయ్యింది.
రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ లాంటి స్కీమ్లు ప్రజల అవసరాలను తీర్చాయి. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాలు కూడా కొన్ని పట్టణ ఓటర్లను ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పథకాలతో ప్రజల అవసరాలను తీర్చుతున్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో పట్టంకట్టారు. టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడంతో.. తెలంగాణ భవన్లో పండుగ వాతావరణం నెలకొన్నది. మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీలో సంబురాలు మిన్నంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలు, మండల కేంద్రాల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని అప్పుడే స్వీట్స్ పంచుకుని.. బాణాసంచాలు కాల్చి ఆనందం పంచుకున్నారు.
Tags: Farmers, Farmers Insurance, 24-hour electricity supply, mission bhagithara, etc