కేంద్ర ప్యాకేజీపై సోమవారం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్ టైమ్స్ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. అడ్రస్ లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్కు తగదని చెప్పారు.
కష్టకాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు సరికాదన్నారు.20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని కితాబు ఇచ్చారు. తెలంగాణ సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఎందుకు ఉపాధి కోసం వలసపోతున్నారని అడిగారు. వలస కార్మికుల సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తీసుకొస్తున్న పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదన్నారు. కానీ కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని కిషన్రెడ్డి నిలదీశారు.పేదలను కేంద్రం ఆదుకోలేదా? ‘‘80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం అందజేయలేదా?, రైతులు, పేద మహిళల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాం. పెన్షన్లు, ఈపీఎఫ్, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం కనిపించడం లేదా?, దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.