- బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
తెలంగాణలో కొరోనా విజృంభణకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. కొరోనా బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కొరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్ ఒక రోజు దీక్ష చేపట్టారు. దీక్షకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొరోనా కారణంగా రాష్ట్రంలోని నిరుపేదలు జీవనోపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రతీ పేద కుటుంబానికి నెలకు రూ. 7500 ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొరోనా బాధితులను ఆదుకునే వరకూ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొరోనా కష్ట•మ•యంలో ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధికి ఎన్ని నిధులు వచ్చాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ? వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు ? వంటి విషయాలను ప్రజలకు చెప్పాలన్నారు.
రాష్ట్రంలో కోవిడ్ ప్రారంభంలోనే నియంత్రణపై దృష్టి సారించకపోవడం, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవడం వంటి వైఫల్యాల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా విస్తరిస్తున్న కొరోనా వైరస్ నియంత్రణకు మొత్తం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కొరోనా నియంత్రణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు ఎన్నిమార్లు కోరినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. కొరోనాకు గాంధీ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలు అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చికిత్స కోసం ఎందుకు ప్రైవేటు ఆసుపత్రులలో చేరుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. కొరోనా వైద్య చికిత్సలను పేదలు భరించే పరిస్థితి లేనందున ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కొరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఆదుకునేందుకు వెంటనే ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారనీ, కొరోనా పరీక్షలను విస్త•తంగా నిర్వహించి వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా చాడ డిమాండ్ చేశారు.