Take a fresh look at your lifestyle.

‌కేసీఆర్‌ ‌స్ఫూర్తిగా మొక్కలు నాటుదాం

కేసీఆర్ జన్మదినం సందర్భాంగా కేక్ కట్ చేసి మహిళకు తినిపిస్తున్న మంత్రి హరీష్ రావు
  • ప్రజలకు మంత్రి హరీశ్‌రావు పిలుపు
  • సిద్దిపేటలో శార్వరీ గ్రీన్‌ ‌పార్కు ప్రారంభం 
  • సిద్దిపేట, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణాగా మార్చుకుందామని

ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్క బొట్టు రక్తం కూడా చిందకుండా మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సీఎం కేసీఆర్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుదామని విజ్ఞప్తి చేశారు.జిల్లా కేంద్రమైన సిద్దిపేట ‘సుడా’ తన కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శార్వరీ గ్రీన్‌పార్కును సోమవారం మంత్రి ప్రారంభించారు. పార్కులో మొక్కలు నాటారు. పార్కులో ఏర్పాటుచేసిన జింక, గుర్రం, తాబేలు బొమ్మలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ 66 ‌వ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో దాదాపు లక్షా 10 వేల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. సుడా పరిధిలో 5900 మొక్కలు, ప్రతి గ్రామంలో 200 మొక్కలు, ప్రతి మున్సిపాలిటీలో 5 వేల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. కేవలం నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడం కన్నా వాటిని సంరక్షించడం గొప్ప పని అన్నారు.

కేసీఆర్‌ ‌జన్మదినం స్ఫూర్తిగా ప్రతి వ్యక్తి తన జన్మదినంనాడు కూడా  మొక్కలు నాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. పెళ్లిళ్లలో కూడా మొక్కలు బహుమతిగా ఇవ్వాలని, అంతేగాక చనిపోయిన వారి పేరు మీద కూడా పట్టణంలోని శ్రీరామకుంట, ప్రశాంత్‌నగర్‌ ‌శ్మశాన వాటికలోని స్మృతివనంలో మొక్కలు నాటాలని సూచించారు. హరిత తెలంగాణలో  అందరం భాగస్వాములం అవుదామని చెప్పారు. శార్వరీ గ్రీన్‌ ‌పార్కు వాకింగ్‌కు, పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించి దాని ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply