Take a fresh look at your lifestyle.

మళ్ళీ పాత కొత్త డిమాండ్‌ ..!

రాబోయే కాలంలో ‘రాజకీయ శాస్త్రం ‘ ఎట్లా ఉంటుందో కానీ .. భవిష్యత్తు ను సూచించే శాస్త్రాలు ..జ్యోతిష్యం, హస్తసాముద్రికం,సంఖ్యా ,వాస్తు ఇతర శాస్త్రాలన్నీ మరో పది సంవత్సరాల వరకు తెలంగాణా రాష్ట్రానికి  కె. చంద్రశేఖర్‌ ‌రావు ముఖ్యమంత్రి అని ఘోషిస్తున్నాయి అనీ ..చివరకు చిలక జోస్యం కూడా అని ఈ మధ్య ఒక కోయదొర సోది చెప్పిండు. మరో వైపు ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు  కె చంద్రశేఖరరావు వారసునిగా ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కెటి రామారావును తీసుకుని వొచ్చేందుకు  పార్టీ శ్రేణులు,  కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే,ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలపరిమితి పూర్తయ్యేనాటికి   ఆయనను కేసీఆర్‌ ‌వారసునిగా నిలబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంగా ఇంత కాలం జనం అనుకుంటూ వొచ్చారు, కానీ,  ఈ మధ్య  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలన్నింటికీ  కేటీఆర్‌ ‌సారథ్యం వహిస్తుండటంతో అనుమానం వస్తోంది. కేసీఆర్‌ ‌కి ఆరోగ్య సమస్యలేవీ  ఉన్నట్టు సమాచారం లేదు. ఆయనే ఓ సందర్బంలో తన ఆరోగ్యం  భేషుగ్గా  ఉందంటూ ప్రత్యర్దుల విమర్శలను సమర్దవంతంగా తిప్పికొట్టారు. రాష్ట్రంలో విధాన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు.  కేటీఆర్‌  ‌నేతృత్వంలోఈ వారంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలన్నీ  గతంలో వేర్వేరు సందర్భాల్లో కేసీఆర్‌ ‌నోటంట వెలువడినవే. అయితే రంగారెడ్డి జిల్లా  కొడంగల్‌ ‌సమీపంలో ప్రైవేటు రంగంలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేయాల్సి ఉండగా, కేటీఆర్‌ ‌చేయడంతో ముఖ్యమంత్రి బాధ్యతలను  క్రమంగా కొడుక్కి కేసీఆర్‌ అప్పగిస్తున్నారేమోనన్న  ఊహాగానాలు సాగాయి. అలాగే, ముఖ్యమంత్రి ఇతర ముఖ్య విధులను కూడా కేటీఆర్‌ ఇటీవల నిర్వహిస్తున్నారు.దానికి తోడు పార్టీ శ్రేణులు,నాయకులు కేసీఆర్‌ ‌ను మంచి చేసుకోవడానికి సాగిస్తున్న ప్రయత్నాలను  మీడియాలో చూస్తున్నాం. కేసీఆర్‌ ఎక్కువ కాలం తన ఫామ్‌ ‌హౌస్‌ ‌కూ,హైదరాబాద్‌ ‌లోని ప్రగతి భవన్‌ ‌కూ పరిమితం అవుతున్న మాట నిజమే.. తన ఆరోగ్యం ఎంతో బాగుందని  ఆయనే ప్రకటించినప్పుడు దానిపై ఊహాగానాలు చేయడం వ్యర్థమే.

ఒక దశలో కేసీఆర్‌ ‌జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర నాయకత్వాన్ని కేటీఆర్‌ ‌కి అప్పగిస్తారన్న ఊహాగానాలు వొచ్చాయి.కోల్‌ ‌కతా వెళ్ళి మమతా బెనర్జీనీ, చెన్నై వెళ్ళి ఎంకె స్టాలిన్‌నూ  కేసీఆర్‌ ‌కలుసుకుని వొచ్చారు.ఇతర నాయకులతో కూడా తరచూఫోన్‌ ‌లో సంప్రదింపులు జరిపేవారు. తృతీయ ఫ్రంట్‌  అనేది మిధ్య అని  కాంగ్రెస్‌, ‌బీజేపీ నాయకులు ఎద్దేవా చేసినా ఆయన  ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూ వొచ్చారు. కానీ,  మోడీ రెండోసారి  అధికారంలోకి వొచ్చిన తర్వాతలోక్‌ ‌సభలోబీజేపీస్థానాలు మరిన్ని పెరగడం,ఆ తర్వాత కొరోనా వ్యాప్తి కావడంతోఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌చర్చలు ముచ్చట్లుగానే మిగిలాయి. కేసీఆర్‌ ‌కూడా కాళేశ్వరం పై దృష్టి పెట్టి  దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుకుకార్యరూపం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పదే పదే చెప్పుకుంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా సహా  పలువురు బీజేపీనాయకులు  తెలంగాణకు కేంద్రం నిధులు ఎక్కువగ ఇస్తున్నా, కాళేశ్వరం తప్పమరే ప్రాజెక్టుపై  కేసీఆర్‌ ‌శ్రద్ధ  చూపడం లేదని  విమర్శలు చేస్తూ వొచ్చారు.వారి విమర్శలను  ముఖ్యంగా, కేంద్రం విడుదల చేసిన నిధులపై   వారి ప్రకటనలను కేసీఆర్‌ ‌తిప్పి కొట్టడం కూడా జరిగింది. అందువల్ల రాజకీయంగా, పాలనా పరంగా కేసీఆర్‌ ‌క్రియాశీలంగానే ఉంటున్న సమయంలో కేటీఆర్‌ ‌ని రంగ ప్రవేశం చేయిస్తున్న తీరుతో  ప్రజల్లో  రకరకాల అనుమానాలు  వొస్తున్నాయి. ప్రతిపక్షాల సంగతి సరేసరి.ఈ వారంలో జరిగిన మంత్రులబృందం సమావేశానికి కేటీఆర్‌ అధ్యక్షత వహించారు.ఆ సమావేశంలో సీనియర్‌ ‌మంత్రి  హరీష్‌ ‌రావు కూడా హాజరయ్యారు. కోచ్‌ ‌ఫ్యాక్టరీ శంకుస్థాపనకు కూడా హరీష్‌ ‌రావు హాజరైనా,  కేటీఆరే శంకుస్థాపన చేశారు.

- Advertisement -

వీటిని దృష్టిలో ఉంచుకుని మొన్న జరిగింది మంత్రుల  బృందం సమావేశమా లేక కేబినెట్‌ ‌సమావేశమా అంటూ ప్రతిపక్ష నాయకుడు ఒకరు సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఇదే మాదిరి  పెక్కు అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రికి బదులు కేటీఆర్‌  ‌ప్రాతినిధ్యం వహించడం అనుమానాలకు బలం వస్తోంది.  కేటీఆర్‌ ‌కు పగ్గాలు అప్పగించడానికి కేసీఆర్‌   ‌నిర్ణయించుకుని ఉండవచ్చునంటూ  పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతకుముందే ఒకరిద్దరు మంత్రులు కేటీఆర్‌ ‌కి పగ్గాలు అప్పగించాలని  బహిరంగంగానే కేసీఆర్‌ ‌కి విజ్ఞప్తి చేశారు. పాత సచివాలయం కుమారుని వాస్తుకు  అనుకూలంగా లేదనే  కూలగొట్టించారనే ఆరోపణలు వొచ్చాయి.  ఆ ప్రక్రియ పూర్తి అయింది కనుక, కుమారుని పట్టాభిషేక ప్రక్రియకు  కేసీఆర్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చి ఉండవొచ్చు. అంతేకాక, కోవిడ్‌ ‌కేసుల సంఖ్యను తక్కువ చూపుతున్నట్టు కేంద్ర నాయకులు ఈ మధ్య తెలంగాణను పదే పదే విమర్శిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు నుంచి కూడా పదే పదే అక్షింతలు పడుతున్నాయి.వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెరాస సీనియర్‌ ‌నాయకులలో ఒకరు. ఈ తరుణంలో మరింత చురుకుగా నిర్ణయాలు తీసుకునేందుకు యువనాయకత్వం అవసరమని భావించి ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్‌ ‌వంటి పెద్ద రాష్ట్రంలోనే సమాజ్‌ ‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు  ములాయంసింగ్‌ ‌యాదవ్‌  ‌పక్కకు తప్పుకుని కుమారుడు అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కి అవకాశం ఇచ్చారు.ఆయన మార్గాన్ని కేసీఆర్‌ అనుసరిస్తున్నారేమోనన్నఊహాగానాలు సాగుతున్నాయి.కోవిడ్‌ ‌కేసులను తగ్గించి చెప్పారన్న ఆరోపణలే కాకుండా మృతుల సంఖ్యను కూడా తెరాస ప్రభుత్వం దాచి పెడుతోందన్న  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్క రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్యతో పోల్చి చూసినప్పుడు అది అనుమానం కాకపోవచ్చన్న వార్తలూ వొచ్చాయి.పోతి రెడ్డి పాడు  విషయంలో కేసీఆర్‌ ‌ను ఇరుకున పెట్టిన సందర్భంలో కేటీఆర్‌ ‌తనకు సంబంధం లేకపోయినా ఓ ప్రకటన చేశారు. జగన్‌తో స్నేహం ఉన్నా, చుక్క నీటి ని కూడా వదులుకోమని ఆయన దాదాపు ముఖ్యమంత్రి మాదిరిగానే స్పష్టం చేశారు.జగన్‌ ‌కు దీటైన జవాబు ఇవ్వాలంటే యువనాయకత్వం అవసరమన్న భావన తెరాస శ్రేణుల్లో కలిగి ఉండవచ్చు. కాళేశ్వరం జలాలతో మెదక్‌, ‌సిద్దిపేట జిల్లాలలో నీటి పారుదల సౌకర్యాలు మెరుగయ్యాయి. కేసీఆర్‌ ‌కి మొదటి నుంచి  వ్యవసాయం అంటే మక్కువ. కాళేశ్వరం సాకారం కాకముందే ఫామ్‌ ‌హౌస్‌లో కూరగాయలు, పండ్లుపండించినఎక్కువ దిగుబడిని సాధించానని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అందువల్ల తన చిరకాల వాంఛ అయిన వ్యవసాయ రంగంపై దృష్టిని కేంద్రీకరించేందుకు కుమారునికి పగ్గాలు అప్పగిస్తారేమోనన్న ఊహాగానాలు కూడా వాస్తవానికి  దగ్గరగా ఉన్నాయి.

అయితే, తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తెరాసలో  బలహీనతలు బయటపడతాయని  కేసీఆర్‌ ‌కు తెలుసు. అంతేకాక,  కేటీఆర్‌ ‌ని ఇప్పటికిప్పుడు గద్దె నెక్కించాలన్న ఆలోచన ఆయనకు లేకపోవచ్చు.  త్వరలో జరగనున్న  గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపై ఉంచేందుకు గతంలో మాదిరిగా కేటీఆర్‌ ‌నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా పని చేసేట్టు చూడటానికి కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు, నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్సిస్తూ    కేటీఆరే వారసుడన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దీని వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాలను వారు గమనించడం లేదు. కేసీఆర్‌ ‌తగిన సమయంలో కీలెరిగి వాత పెడతారు. ఇప్పటికిప్పుడు అయితే కేటీఆర్‌ ‌ని తన వారసునిగా  కేసీఆర్‌ ‌ప్రకటించకపోవచ్చు,అవన్నీ ఊహాగానాలే. తెరాసలో ఇలాంటి  ఊహాగానాలు బయలు దేరడం ఇది మొదటి సారి కాదు. వీటి వల్ల పార్టీ అసలయిన ఓనర్లయిన  సీనియర్‌ ‌నాయకుల మనోభావాలని దెబ్బతీసినట్టు అవుతుందని కేసీఆర్‌  ‌త్వరగా గ్రహించడం  ఆ పార్టీకే మంచిదే.

Leave a Reply