Take a fresh look at your lifestyle.

దాశరథి స్ఫూర్తితోనే..

  • సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారు
  • గ్రంథాలయాలకు సంపూర్ణ సహకారం అందిస్తా
  • దాశరథి జయంతి సభలో మంత్రి హరీష్‌రావు

‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య స్ఫూర్తితోనే తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసుకోవడంతో పాటు కోటి ఎకరాల మాగాణంగా మార్చారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో గురువారం దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించడంతో పాటు సిద్ధిపేట జిల్లా గ్రంథాలయంలో వేముగంటి నర్సింహాచార్యుల చిత్రపటానికి నివాళులు అర్పించి, విపంచి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికై శాశ్వత సభ్యత్వం పొందిన సభ్యులకు సభ్యత్వ కార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిందంటూ.. నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయనీ, 3 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. పుస్తకపఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని, సిద్ధిపేట జిల్లా లైబ్రరీని వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని సిఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారని, ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సిఎం కేసీఆర్‌ ‌చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అవసరం మేరకు రాష్ట్రంలో 64 వేల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి వివరించారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నట్లు మంత్రి పేర్కొంటూ.. అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తానని భరోసా ఇచ్చారు. కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌లో పాల్గొనే ఉద్యోగార్థులకై జిల్లా లైబ్రరీలో 50కుర్చీలతో కూడిన వసతి కల్పించినట్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్ ‌కావాల్సిన పుస్తకాలు పెట్టాలని ఆయాచితం శ్రీధర్‌కు మంత్రి సూచించారు. అంతకుముందు దాశరథి పాటలు, ఆయన రాసిన కవిత్వం వింటుంటే అమృత ధారలు కురిసిన విధంగా మంచి అనుభూతి పొందినట్లు మంత్రి చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారనీ, పీడిత ప్రజల పక్షాన పోరాడినట్లు చెప్పుకొచ్చారు. దాశరథి కలలుగన్న వారి ఊహాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసీఆర్‌ ‌నిజం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.

దాశరథి యాదిలో ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. దాశరథి సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా తెలంగాణ సాహితీమూర్తులను నగదు పురస్కారాలతో సత్కరించుకుంటూ గౌరవించు కుంటున్నామని గుర్తు చేశారు. అంతకు ముందు ప్రముఖ వక్తలు దాశరథి గురించి వారు రాసిన రచనలు, వారి అనుభవం తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా దళిత బంధు అనే కార్యక్రమాన్ని సిఎం కేసీఆర్‌ ‌తెచ్చారనీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌సిఎం ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ‌కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుబాషావేత్త నలిమెల భాస్కర్‌, ‌బెవరేజెస్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌దేవీప్రసాద్‌, ‌మీడియా అకాడమీ సభ్యుడు కొమురవెళ్లి అంజయ్య, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, వర్కింగ్‌ ‌జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు కలకుంట్ల రంగచారి, ఆర్డీవో అనంతరెడ్డి, పలువురు సాహితీవేత్తలు, అభిమానులు హాజరయ్యారు.

Leave a Reply