వైరస్ కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్లలో కూడా పారదర్శకత లేకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కొరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కొరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోఠిలోని కంట్రోల్ కమాండ్ సెంటర్ వద్ద శాంతియుతంగా ఆందోళన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మాజీ మంత్రులు విజయరామారావు, పెద్దిరెడ్డి తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులతో అణచివేయడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్న టీఆర్ఎస్ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నిజాయితీని శంకించే హక్కు రాష్ట్ర మంత్రులకు లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో భారీ సంఖ్యలో కొరోనా టెస్టులు చేస్తున్నారనీ, రాష్ట్రంలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయడం లేదని విమర్శించారు. గచ్చిబౌలిలో కొరోనా రోగులకు వైద్య చికిత్సలను వెంటనే ప్రారంభించాలనీ, వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి కూడా రక్షణ లేకుండా పోయిందనీ, పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని వైద్యులు ఆందోళనకు దిగుతుంటే సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 10 లక్షల పీపీఈ కిట్లు, మాస్కులు అంటూ గప్పాలు కొడుతున్న మంత్రులు అసలు వాటిని ఎక్కడ పంపిణీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం అబద్దాలు మాని వైద్యులు పోలీసులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కొరోనా కట్టడి కోసం సీఎం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈసందర్బంగా బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.