తెలంగాణ ప్రజల ఆస్తుల్ని బహిరంగంగా వేలం పాటలో అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ అమ్మకాలు ఆపి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూముల అమ్మకాన్ని సవాల్ చేస్తు సుప్రీమ్ కోర్టుకు పోవాలి. 7200 కోట్ల విలువైన భూముల్లో పరిశ్రమల్ని పునఃప్రారంభించడానికి దిల్లీలో దీక్షకు కూర్చోవాలి. దండుగమారి, అవినీతి పథకాలతో రాష్ట్రాన్ని దివాల తీయించి, తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరిపై దండెత్తే నైతిక అర్హత కోల్పోయి కేసియార్, కేటియార్ ఎన్ని సవాళ్ళు విసిరినా, ఐడిపియల్లో రోడ్డు విషయంలో దమ్ముంటే తనపై కిషన్‌రెడ్డికి కేసులు పెట్టి, అరెస్టు చేయమనడం ఉత్తుత్తి తాటాకు చప్పుడు కాక నిజమైన ప్రతిఘటన అని తెలంగాణ ఎట్లా నమ్మేది?.
అగ్ని పథ్ పేరుతో కొనసాగిన అనాలోచిత కాంట్రాక్టు రిక్రూట్మెంట్ ఎంత అన్యాయమో కేసియార్ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యోగాల కల్పనలో వైఖరి అంతే అన్యాయం. కనీస పారదర్శకత లేకుంటా మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి చేసి కేంద్రం నుండి రావాల్సిన 19 వేల కొట్లు ఇవ్వలేదంటే తెలంగాణ ప్రజలు స్పందిస్తారా? మాకు ప్రభుత్వ భూములు అప్పగించండి స్కైవేలు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామంటే ఇప్పుడున్న మంచి రేవుల టు ప్రతాప సింగారం ఈస్ట్-వెస్ట్ కారిడార్‌కు ఏ సైనిక, కేంద్ర ప్రభుత్వ భూములు అడ్డం వచ్చినాయి? హైదరాబాద్ మురికివాడలలోని ప్రజలకు వేల ఎకరాలలో నివాసాలు ఏర్పాటు చేసే బాధ్యత వదిలిపెట్టి ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్‌కు, తమ సామంతులకు భూములు, ప్లాట్లుగా అమ్మి మోడీ మీద అరచి ఏమి లాభం? ఇప్పటికే తెలంగాణకు జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోయింది.
గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం అనుసరించనంత వివక్ష నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగించినా, కేవలం కేసియార్ ఒంటెద్దు పోకడవలననే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మేము ఎవరితో కలిసి ఉద్యమాలు చేయం… తెలంగాణ మా సొంత జాగీరు…. సామ్రాజ్యం అన్న వైఖరి ఉన్నంత కాలం టి.ఆర్.యస్ వలన తెలంగాణ నష్టపోతూనే ఉంటదని స్పష్టం చేస్తున్నాం.ఒక్కనాడు రాష్ట్రంలో అఖిలపక్షాన్ని పిలువని కేసియార్ కేంద్రంపై అన్ని పక్షాలను కలసి పోరాడుతామంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని గుర్తు చేస్తున్నాం.
– డా. చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు