బైంసా అల్లర్ల పై అమిత్ షాకు ఎంపి సోయం బాపురావు ఫిర్యాదు..
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, జూలై 28 : తెలంగాణలో హిందువులపై టీఆర్‌ఎస్ సర్కార్ వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు ఫిర్యాదు చేశారు. మార్చి 7న బైంసాలో జరిగిన హింసాత్మక ఘటనలలో ఒక వర్గానికి చెందిన 31 మందిపై కేసులు పెట్టిందని వివరించారు. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను ఎంపి సోయం బాపురావు కలిసారు. ఈ సందర్భంగా బైంసా అల్లర్లు జరిగిన తీరు, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిపై అమిత్ షా కు వివరించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
హిందువులపై చిత్రహింసలు పెట్టి ఇంటరాగేట్ చేసిన ప్రభుత్వం, మైనారిటీలపై నామ మాత్రపు కేసులు పెట్టి వొదిలేసిందన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్లీ ప్రివెంటివ్ పేరుతో అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని వివరించారు. మహారాష్ట్ర నుంచి వొచ్చిన కొంతమంది మైనారిటీ వర్గానికి చెందిన వారు ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అల్లర్లతో హిందువుల వ్యాపారాలు, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లతో సంబంధం లేని వారిపై టాడా కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అలాంటి వారికి న్యాయం చేయాలని కేంద్ర హోమ్ మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని మంత్రికి వివరించినట్లు చెప్పారు. బైంసా అల్లర్లపై ఫోకస్ పెడతామని, సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు బాబూరావు తెలిపారు.
30న బిజేపి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా…
గిరిజనులు, దళితులు, బీసీలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో ఈ నెల 30 న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేయనున్నట్లు ఎంపి బాబూరావు తెలిపారు. పోడు వ్యవసాయం చేసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ దళితులకు మూడెకరాల భూమి, బీసీలకు ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఆయా వర్గాలను మోసం చేశారన్నారు. హరిత హారం పేరుతో పోడు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున్న దళితులు, గిరిజనులు, బీసీలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.