Take a fresh look at your lifestyle.

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట అన్న పేరున్నప్పటికీ, జాతీయ స్థాయిలో అందునా అధికారంలో ఉన్న బిజెపి ఎదుర్కోవడంలో కేవలం తన ఎత్తుగడలు చాలవనుకున్నట్లుగా ఆయన తన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌లాంటివారి సహకారాన్ని తీసుకుంటున్నారు. అయితే కెసిఆర్‌లాగానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని మార్చాలన్న విషయంలో పట్టుదలగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు కెసిఆర్‌ ‌సారధ్యాన్ని ఏ మేరకు అంగీకరిస్తారన్న విషయం మాత్రం ఇంకా అస్పష్టమే.

ఇదిలా ఉంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని పడేయాలంటే ముందుగా ఇంట గెలువాల్సి ఉంటుంది. అంటే 2023లో రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో నెగ్గి, తిరిగి అధికారం చేపట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నది సుస్పష్టం. అందుకే కెసిఆర్‌ ‌దూర దృష్టితోనే కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వడం ప్రారంభించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో బిజెపిని దెబ్బ కొట్టడంద్వారా రాష్ట్రంలో ఆ పార్టీకి చెక్‌ ‌పెట్టవొచ్చన్నది కెసిఆర్‌ ‌వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే రాష్ట్రానికి చెందిన వరి కొనుగోలు సమస్యను జాతీయ సమస్యగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నదని గొంతెత్తి చాటుతున్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారాలపై చర్చ జరుగాలంటున్నారు. అసలు రాజ్యాంగంలోనే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేకాదు.

సముద్రాలపాలవుతున్న నీటిని వినియోగంలోకి తెచ్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థతను వేలెత్తి చూపుతున్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలపై వివిధ రాష్ట్రాలు, కేంద్రంకూడా కితాబు ఇస్తున్న విషయాలను గుర్తుచేస్తూ, రేపు కేంద్రంలో తాము అధికారంలోకి వొస్తే ఇలాంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న భరోసాను ప్రజలకు కల్పించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇక వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఒకటి చెబితే రాష్ట్రం మరోటి చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక జాతీయ సమస్యగా రూపొందించే ప్రయత్నం చేస్తోంది టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌. ‌భవిష్యత్‌లో మూడవ కూటమి ఏర్పడితే కెసిఆర్‌ ‌తడాఖా ఎలా ఉంటుందన్నది చూపించడంలో భాగమన్నట్లుగా కేంద్రంపై ధ్వజమెత్తుతోంది తెలంగాణ సర్కార్‌. ‌వరి కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానానికి• ఈ నెల నాలుగవ తేదీనుండి రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గతంలో తెలంగాణకోసం ఉద్యమించిన తరహాలో వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేస్తోంది. మండల కేంద్రాల్లో ధర్నాలు, జాతీయ రహదారుల దిగ్బంధం, కలెక్టరేట్ల వద్ద నిరసనదీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రతీ ఇంటిపైన నల్లజెండాల ప్రదర్శన, బైక్‌ ‌ర్యాలీలు, చివరకు దున్నపోతుకు విజ్ఞాన పత్రాలను అందజేయడంలాంటి వినూత్న ప్రక్రియలతో తమ నిరసన కార్యక్రమాలను టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, పార్టీ చేపడుతున్నది.

కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుంటే రాష్ట్రంలో పండిన పంటనంతా దిల్లీకి తెచ్చి గుమ్మరిస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ‌నేతలు అలా చేస్తారోలేదోగాని, ఇప్పుడయితే కేంద్రం చెవిలో శంఖారావం చేసేందుకు సన్నద్దమవుతున్నారు. సోమవారం దిల్లీ లోని తెలంగాణ భవన్‌ ‌వద్ద నిరసన ప్రదర్శనలు చేయడంద్వారా కేంద్రాన్ని నిద్రలేపాలను కుంటుంది . ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. సుమారు పదిహేను వందలనుండి మూడువేలమంది దాకా మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, పార్టీ సీనియర్‌ ‌నాయకులు, ప్రతినిధులు పాల్గొనేవిధంగా షామియానాలు, ఇతర సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ సమస్య కేవలం తమ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదని చెప్పేందుకు ప్రముఖ రైతు నాయకుడు రాకేష్‌ ‌తికాయ్‌త్‌తో సహా, వివిధ రైతు సంఘాలు, రైతు నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తున్నది. వరి విషయంలో కేంద్రంపై పూరించిన శంఖారావాన్ని ఈ సమావేశంతో టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌ముగించనుందా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే కేంద్రం ఈవిషయంలో పట్టుదలగానే ఉంది. రా బియ్యం ఇస్తేతప్ప బాయిల్డ్ ‌రైస్‌కాని, ముడి సరుకుగాని కొనే ప్రసక్తిలేదని చెబుతోంది. అయితే తమ ఆందోళనకు ఇక ముగింపు పలకడానికే దిల్లీ ధర్నా కార్యక్రమాన్ని కెసిఆర్‌ ‌రూపొందించి ఉంటాడనుకుంటున్నారు. దిల్లీ వేదికగా కేంద్రం కొనగోలుచేయకపోయినా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేమే కొంటామని కెసిఆర్‌ ‌ప్రకటించినా ఆశ్చర్యంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రానున్న ఎన్నికల్లో గోలకొండపైన కాషాయ జండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేస్తున్న భారతీయ జనతాపార్టీ కూడా రాష్ట్రంలో పెరిగిన ఆర్టీసి చార్టీలు, విద్యుత్‌ ‌ఛార్జీలపైన ధ్వజ మెత్తుతోంది. సామాన్యులను ఇబ్బంది పెట్టేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వొచ్చినట్లుగా ఛార్జీలు పెంచుతున్నదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఆ పార్టీ చేపడుతున్నది. అలాగే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ఛార్జీలు పెరిగితే తన కొచ్చే లాభాన్ని రాష్ట్రం కొంత తగ్గించుకుని వాటి ధరలు తక్కువచేయవచ్చుకదా అంటూ ప్రభుత్వంపై ఎదురు దాడి ప్రారంభించింది. ఈ రెండు పార్టీలుకూడా తమ రాజకీయ సమస్యలను ప్రజాసమస్యలకు ముడిపెట్టి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.

Leave a Reply