Take a fresh look at your lifestyle.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తిరిగి జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కసరత్తు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో చర్చలు జరిపారు. డిఎంకె కురువృద్ధుడు కరుణానిధి సజీవంగా ఉన్నప్పుడే ఆయన చెన్నై వెళ్ళి చర్చలు జరిపారు. ఆ సందర్భంగానే తమిళనాడులోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. రాష్ట్ర మంత్రి కెటి రామారావుకు రాష్ట్ర నాయకత్వాన్ని అప్పగించేందుకు కేసీఆర్ ఎంతో కాలంగా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచన చేస్తున్నారు. హిందీ, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్నందున ఆయనకు ఉత్తరాది నాయకులతో భాషాపరమైన చిక్కులు ఏమీ తలెత్తవు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలపైన ఆయనకు అవగాహన ఉంది. తన కుమారునికి రాష్ట్ర పగ్గాలను అప్పగించేందుకు తగిన ముహూర్తం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయనకు వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలపై గట్టి నమ్మకం ఉంది. ఈ రెండు కలిసొచ్చినప్పుడు చేయాలనుకున్నవి చేసేయడం.. అందుకోసం ఎందాకైనా వెళ్ళడం ఆయనలో ప్రత్యేకత. విమర్శకులను, రాజకీయ ప్రత్యర్దులను తన వాదనా పటిమతో చిత్తు చేయగలనన్న నమ్మకం ఆయనకు బాగా ఉంది.

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ మైన కాంగ్రెస్ పరిస్థితి కోలుకోలేని రీతిలో ఉండటం వల్ల ప్రాంతీయ పార్టీల కూటమిదే హవా అంటూ ఆయన చాలా సార్లు ప్రకటనలు చేశారు. ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడున్న నేతలందరి కన్నా తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఆరు దశాబ్దాలు పైగా హైదరాబాద్ లో సుమారు 18 మంది ముఖ్యమంత్రులకు కార్యస్థలమైన సచివాలయ భవనాల సముదాయాల టవర్ల ను కూలగొట్టించి కొత్త సచివాలయాలను నిర్మించేందుకు సంకోచించకపోవడం కేసీఆర్ సాహసానికి నిదర్శనం. వాస్తు కోసమే వాటిని కూలగొట్టించారన్నది జనాంతికం. ఆ అడ్డు తొలగిపోయింది కనుక తన కుమారునికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు ఇక అడ్డంకులేవీ ఉండవని ఆయన భావిస్తున్నారన్నది కూడా జనాంతికమే. జాతీయ స్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో అందరినీ కూడగట్టగల సత్తా తనకే ఉందని ఆయన నమ్ముతున్నారు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నట్టు మీడియాలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. మీడియా మేనేజి మెంట్ లో ఆయనను మించిన వారు దేశంలో లేరని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అయితే, ఆయన రాజకీయ వారసుడు ఇంకా అప్పటికి ఎదిగి రాకపోవడం వల్ల ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించే సాహసం చేయలేదు. కింగ్ కన్నా, కింగ్ మేకర్ స్థానమే మంచిదని ఆయన అప్పట్లో భావించారు. కేసీఆర్ కి రాజకీయ వారసుడు తయారై ఉన్న కారణంగా ఆయనకు అటువంటి సమస్య లేదు. అంతేకాక, రాష్ట్రంలో కీలకమైన మంత్రి పదవులను నిర్వహిస్తూ, పబ్లిసిటీ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి ప్రచారం లభిస్తోంది. ముఖ్యమంత్రి వేరే కారణాల చేత హాజరు కాలేని కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇప్పటికే డీ ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక, కేటీఆర్ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించడంలో తొలి నాళ్ళలో ఉన్న తొందరపాటు ఇప్పుడు కనిపించడం లేదు.ఆయన ఎంతో హుందాగానే విమర్శలు చేస్తున్నారు. సమస్యలన్నింటినీ ఆకళింపు చేసుకుని గణాంకాలతో సహా వివరణలు ఇస్తూ ప్రత్యర్ధుల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కొందరు సీనియర్ మంత్రులు సైతం కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో కేటీఆర్ చొరవ తీసుకుంటుండటం వల్ల ఆయన చురుకైన నాయకునిగా ముద్ర పడింది. కేసీఆర్ మెప్పు కోసం మంత్రులు బహిరంగంగానే కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రి అని ప్రశంసలు చేస్తున్నారు జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడు ఎన్టీఆర్ ఆయన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెసేతర పార్టీల అగ్రనాయకులందరినీ హైదరాబాద్ ఆహ్వానించి కాన్ క్లేవ్ లు నిర్వహించారు.ఆయన ఆశీస్సులతో రాజకీయాల్లోకి వొచ్చిన కెసీఆర్ ఆయన మాదిరిగానే జాతీయ రాజకీయ కూటమికి తానే ఎందుకు చొరవ చూపకూడదని అనుకుని ఉంటారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో తన కుమారునికి ఆయన పేరును పెట్టుకోవడమే కాకుండా, తెలంగాణలోని పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కోసం కృషి చేసినట్టే తాను కూడా ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేయాలన్నది కేసీఆ ర్ ఆశయంగా కనిపిస్తుంది. హోమాలు, యాగాలు నిర్వహించినా, తాను సెక్యులరిస్టునేనని చెప్పుకోవడానికి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతో మైత్రి కొనసాగించడమే కాకుండా, హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించి దేశంలో ముస్లింలంతా తనకే మద్దతు ఇచ్చేందుకు ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేకత, ముస్లిం వోటు బ్యాంకు ఆధారంగా జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టిని కేంద్రీకరించడానికి ప్రధాన కారణాలు ఇవే.

Leave a Reply