Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ కు కేసుల భయం ..!

  • ‌అందుకే కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎన్నికలు ఉన్నప్పుడే సర్పంచ్‌, ఎం‌పిపి, ఎంపిటిసిలు గుర్తుకొస్తారని పేర్కొన్నారు. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సంజయ్‌ ‌భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రానున్న మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీపరంగా అనుసరించాల్సిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఒక్క పైస కూడా కేటాయించలేదని విమర్శించారు. రైతు వేదిక, స్మశాన వేదికలు, రైతులకు ఇచ్చే ట్రాక్టర్ల డబ్బులన్నీ కేంద్రానివేననీ, స్థానిక సంస్థల కోసం కేంద్రం ఇచ్చే నిధులు కూడా కేసీఆర్‌ ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు.

- Advertisement -

గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్‌ ‌నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. తెలంగాణవ్యాప్తంగా ఎంపిపిలు, జెడ్పీటిసిలు, ఎంపిటిసిల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కలెక్టర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనీ, అందుకే తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపొద్దని కేసీఆర్‌ ‌కేంద్రం వద్ద పొర్లు దండాలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీపై యుద్ధం ప్రకటిస్తానన్న కేసీఆర్‌ ‌మెత్తబడి ఫామ్‌ ‌హౌస్‌లో పడుకుంటున్నారనీ, మేం ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రానికి భయపడే కేసీఆర్‌ ‌యూటర్న్ ‌తీసుకున్ని కేంద్ర పథకాలను అమలు చేస్తున్నారనీ, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కడ ఆగిపోతాయోనని హడావుడిగా కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారనీ, బుద్ధి, సిగ్గు ఉన్న వారెవరూ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోరని ఓ ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply