Take a fresh look at your lifestyle.

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టుపట్టించారు

  • బంగారు తెలంగాణ అని..బార్ల తెలంగాణగా మార్చారు
  • అక్టోబర్‌ 20 ‌నుంచి పాద యాత్ర
  • వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల

అక్టోబర్‌ 20 ‌నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని షర్మిల విమర్శించారు.  సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్, ‌పోడు భూములు కూడా తిరిగి తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ‌సీఎం అయిన తర్వాత దళితులపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు.

చిన్నపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం, డ్రగ్స్ ‌విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, బంగారు తెలంగాణ అన్నారని.. రాష్ట్రం బార్ల తెలంగాణగా మారిందని షర్మిల విమర్శించారు. కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టడంలేదని, రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంకు చీమ కుట్టినట్టయినా లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్రలకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌ ‌వైఎస్‌ఆర్‌ అని, వైఎస్‌ ‌పాదయాత్ర నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్ ‌మెంట్‌, ఆరోగ్య శ్రీ, 108,  ఉచిత విద్యుత్‌, ‌జలయజ్ఞమని అన్నారు.

ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గత ఏడేండ్ల కేసీఆర్‌ ‌పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని..రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, సీఎం కేసీఆర్‌ ‌మోసం చేశారని ఆమె మండిపడ్డారు. కేవలం 3 లక్షల మందికే మాఫీ చేసి, 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో 91 శాతం మంది రైతులకు కనీసం రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు ఓ సర్వే చెబుతుందని, ఈ లెక్కన రైతులందరూ అప్పులపాలయ్యారని వైఎస్‌ ‌షర్మిల అన్నారు.

Leave a Reply