Take a fresh look at your lifestyle.

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు నవంబర్‌ 29… ‌దీక్షా దివస్‌

2009 ‌నవంబర్‌ 29… ‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్కటి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్‌ ‌తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెరాసను స్థాపించి, లక్ష్య సాధనకై, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెరవక, అలుపెరుగని పోరాట స్పూర్తితో, లక్ష్య సాధన పై అకుంఠిత విశ్వాసంతో, మరణ శాసనాన్ని స్వయంగా లిఖించుకుని, సంతకించడానికి సంసిద్ధమై ప్రాణ త్యాగానికి తెరాస అధినేత సిద్ధమైన రోజు. అదే కేసిఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభానికి సిద్ధమైన రోజు. కేసిఆర్‌ ‌త్యాగ నిరతే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి పునాది యనేది వివాద రహిత అంశం. కాదనలేని వాస్తవం.

2009 నవంబర్‌ 29‌న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచి, దిల్లీ పాలకుల చేత రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు మూలమైన నేపథ్యం, కేసిఆర్‌ ఆమరణ దీక్ష సందర్భం, క్రమాను గత సంఘటనల క్రమాన్ని మననం చేసుకునే ప్రయత్నం. ఆమరణ నిరాహార దీక్షకు ముందు వ్యూహరచన, మానసిక సన్నద్ధం కోసం 26వ తేదీ సాయంత్రం కేసిఆర్‌ ‌కరీంనగర్‌ ‌తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అప్పటికే దీక్షకు సంబంధించి వాతావరణం వేడెక్కడంతో, ఆయనకు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. మహిళలు ముందుండి వీరతిలకం దిద్దారు. కేసిఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో బస చేయడంతో ప్రభుత్వం కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి నిలిపింది. కేసిఆర్‌ ‌దీక్షను అడ్డుకోవడానికి 144 సెక్షన్‌ ‌విధించడం, తెలంగాణ భవన్‌ ‌వద్ద భారీగా పోలీసులు, ఇంటలిజెన్స్ ‌వర్గాలు చేరడంతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపడుతారా, పోలీసులు అడ్డుకుంటారా అనే సంశయం యావత్‌ ‌తెలంగాణ ప్రజల్లో టెన్షన్‌. 29‌న ఉదయం దీక్షకు బయలు దేరకుండా హౌజ్‌ అరెస్టు చేస్తారని.. మార్గమధ్యలో అదుపులోకి తీసుకుంటారని, దీక్షాస్థలి సమీపంలో అరెస్టు చేస్తారంటూ పలు ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఆ నాటి అర్ధరాత్రి ఎమి జరగనుందో అని 28వ తేదీ రాత్రి కరీంనగర్‌లో ఉత్కంఠ క్షణక్షణం పెరిగింది. దీక్షను అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం కేసిఆర్‌ ‌బస చేసిన ఉత్తర తెలంగాణ భవనం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అర్ధరాత్రి 12 గంటలకు భవన్‌ను పోలీసులు చుట్టు ముట్టారు. పోలీసుల ప్రయత్నాలను ఎదుర్కోవడానికి కార్యకర్తలు, నేతలు కూడా పెద్ద సంఖ్యలో భవన్‌కు చేరుకొని కేసిఆర్‌ ‌కు అండగా లోపలే ఉండి పోయారు. రాత్రంతా ధూంధాం నిర్వహించారు. కార్యకర్తలు పలుమార్లు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత పెరిగింది.

29వ తేదీ ఉదయం తెలంగాణ భవన్‌లోనే మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ దమనకాండను నిరసించారు. ఉత్తర తెలంగాణ భవన్‌ ‌నుంచి దీక్షకు సిద్ధమయ్యారు. తర్వాత ఉదయం 7.30 గంటలకు తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌, ‌నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్‌ ‌లక్ష్మీకాంతరావుతో కలిసి మెదక్‌ ‌జిల్లా సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి వాహనంలో బయలు దేరారు. భవన్‌లో కాకుండా మార్గమధ్యలో అరెస్టు చేయాలనే పక్కా వ్యూహంతో పోలీసులు కేసిఆర్‌ ‌ను వెంబడించారు. కేసిఆర్‌ ‌కాన్వాయ్‌ ‌బయలు దేరగానే, కార్తకర్తలు, మీడియా వాహనాలు కాన్వాయ్‌ను అనుసరించకుండా అల్గునూర్‌ ‌బ్రిడ్జివద్ద నిలిపివేశారు. ఎమ్మెల్యేల వాహనాలను సైతం అనుమతించ లేదు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గునూరు చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపివేసి కేసిఆర్‌ ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టుకు నిరసనగా అల్గునూరు చౌరస్తాలోని రోడ్డుపై కూర్చొని కేసిఆర్‌ ‌కొద్దిసేపు ఆందోళన చేశారు. కార్యకర్తలు వాహనాల టైర్లలో గాలి తీసి ముందుకు కదలకుండా చేశారు. అక్కడి నుండి కెసిఆర్‌ను మరో వాహనంలో హుజురాబాద్‌, ‌వరంగల్‌ ‌మీదుగా పోలీసులు ఖమ్మం తరలించారు. ఆగ్రహించిన కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కేసిఆర్‌ ‌కు మెజిస్ట్రేట్‌ 14 ‌రోజులు రిమాండ్‌కు ఆదేశించడంతో.. ఖమ్మం జైలుకు తరలించగా, జైలులోనే ఆయన ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలా తెలంగాణ భగ్గుమంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వేల సంఖ్యలో రోడెక్కారు. జైల్లోనే గులాబీ అధినేత దీక్షతో, ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌కు తరలించారు. డాక్టర్లు వద్దంటున్నా నిమ్స్ ‌లో కూడా దీక్ష కొనసాగించిన కేసీఆర్‌… ‌కేంద్రం దిగి వస్తేనే వెనక్కు తగ్గుతానని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో• తెలంగాణలో అగ్గి రాజుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉరకలెత్తింది. కాకతీయ విశ్వ విద్యాలయం కదం తొక్కింది. శాతవాహన శివాలెత్తింది. పోలీసులు రబ్బరు బుల్లెట్లు వదిలినా.. బాష్పవాయు గోళాలు పేల్చినా విద్యార్థులు పిడికిళ్లు దించలేదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, టీచర్లు, విద్యార్థులు. కోట్ల గొంతుకలు ఒక్కటయ్యాయి. 10 జిల్లాల్లో ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్‌ ‌లతో బస్సులు, రైళ్లు స్తంబించి పోయాయి. పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికే కట్టుబడి ఉన్న సీపీఎం మినహా మిగిలిన అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాయి. ఇదే విషయం స్పష్టం చేస్తూ దిల్లీకి నివేదిక కూడా ఇచ్చాయి.

చివరికి కేసీఆర్‌ ‌దీక్ష ప్రారంభించిన 12 రోజులకు.. సరిగ్గా డిసెంబర్‌ 9.. 2009‌న కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఆ రోజు అర్థరాత్రి.. అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ద్వారా ప్రకటింప చేశారు. ఈ ప్రకటనతో యావత్‌ ‌తెలంగాణ పులకించి పోయింది. ఆందోళన స్థానంలో హర్షాతిరేకాలు చేరాయి. ధర్నాలు, నిరసన స్థానంలో సంబరాలు, విజయోత్సవాలు కనిపించాయి. అయితే రోజులోనే పూర్తిగా మారి పోయింది. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు.. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలతో ఒక్కటయ్యారు. సీమాంధ్ర నేతల తీరుతో కేంద్రం కూడా వెనక్కి తగ్గింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పక్కన పెట్టింది. ఈ ఆలస్యమే తెలంగాణ ఉద్యమకారుల్లో మరింత ఉద్రేకాన్ని రగిల్చింది. చివరగా తెరాస అధినేత కేసీఆర్‌ ‌నాయకత్వంలో… అన్ని వర్గాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply