Take a fresh look at your lifestyle.

రాయలసీమ ఎత్తిపోతలను ఆనాడు కెసిఆర్‌ అం‌గీకరించారు

  • కృష్ణా బోర్డు ఆదేశాలను కూడా తుంగలో తొక్కారు
  • తెలంగాణ తీరుపై సజ్జల అసహనం

అమరావతి,జూలై 2 : రాయలస ఎత్తిపోతలకు సిఎం కెసిఆర్‌ ‌స్వయంగా ఆమోదం తెలిపారని, ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో జరిగిన చర్చలో తానే సాక్షి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. ఆనాడు రాయలసీమకు మద్దతు పలికి ఇవాళ వ్యతిరేకించడం ఎందుకని ప్రశ్నించారు. అయితే రాయలసీమ ఎత్తిపోతలతో తాము కేటాయించిన నీటినే వాడుకుంటామని అన్నారు. కెసిఆర్‌ ‌నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదన్నారు.శుక్రవారం ఆయన డియాతో మాట్లాడుతూ..జల వివాదం విషయంలో కేఆర్‌ఎం‌బీ చెప్పినా తెలంగాణ వినడం లేదని అందుకే సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌లేఖ రాయాల్సి వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సీఎం జగన్‌ ‌ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం జగన్‌ ‌సహకరించారని గుర్తు చేశారు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రాయలసీమ ప్రయోజనాలు అవసరమని కేసీఆరే అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎందుకు పరిస్థితులు మారాయో అర్ధంకావడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం జల ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీఆర్‌ ‌యాక్ట్, ‌కేఆర్‌ఎం‌బీ ఆదేశాలను తెలంగాణ పట్టించు కోవడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం జలవివాదాలకు దిగడం భావ్యం కాదన్నారు. ఒకరి అవసరాలు ఒకరు గుర్తించి అభిప్రాయాలను గౌరవించాలన్నారు. శ్రీశైలం జలవిద్యుత్‌ ‌కేంద్రంలో ప్రమాదం జరిగినప్పుడు అండగా నిలిచాము. తెలంగాణకు నీటి అవసరాలు ఉంటే సహకరించేవాళ్లం.

అన్నీ మర్చిపోయి పోలీసులను దించి యుద్ధ వాతావరణం కల్పించారు. పులిచింతల బ్యారేజీపై హక్కు లేకున్నా ఇష్టానుసారం వ్యవహరి స్తున్నారని తెలిపారు. సాగునీరు విడుదల సమయంలో విద్యుదుత్పత్తి చేస్తే ఏ సమస్య రాదు. జాతీయ జలవిధానాన్ని ఉల్లఘించినందునే సమస్య తలెత్తింది. తెలంగాణ అనాలోచిత నిర్ణయం వల్ల నీటి కష్టాలు వస్తాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ఇబ్బందులొస్తాయి. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరిస్తుందని భావిస్తున్నామని అన్నారు.

Leave a Reply