- బిస్వాల్ కమిటీ నివేదికను పక్కన పెట్టిన సర్కార్
- కొత్తగా ఉద్యోగ ఖాళీలపై ఆరా తీయడంలో అర్థం లేదు
- పెట్రో ధరలకు నిరసనగా నేడు ఛలో రాజ్‌భవన్ పిసిసి చీఫ్ రేవంత్
- చలో రాజ్‌భవన్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ
సీఎం కేసీఆర్ మరో మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తున్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందన్నారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైంది. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటని ప్రశ్నించారు. వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా…56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటని నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని…అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ధరలపై పార్లమెంట్‌ను కూడా స్తంభింపజేస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిర్బంధించాలని చూస్తే పోలీస్‌స్టేషన్లను ముట్టడిస్తామన్నారు. ఎన్ని జైళ్లలో, ఎన్ని స్టేషన్‌లలో పెడతారో చూస్తామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు. మరోవైపు నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వారు తెలిపారు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ.. లిఖిత పూర్వక సమాచారమిచ్చారు పోలీసులు. ఇందిరా పార్క్ దగ్గర కేవలం.. రెండు మైకులు పెట్టుకొని సభ నిర్వహించుకోడానికే అనుమతినిచ్చారు.