Take a fresh look at your lifestyle.

హైందవ ధర్మానికి కేసీఆర్‌ ‌కళంకం

  • టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాజ ఆగ్రహానికి గురికాక తప్పదు
  • విజయశాంతి హెచ్చరిక

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరుపై బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ…హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో సిఎం కేసీఆర్‌ ‌గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారనీ, నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టాలను కాపాడాల్సిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి… గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారన్నారు. ‘లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్‌ ‌పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్‌ ‌రోజున గోవధ చేస్తామంటూ డిజిపికి వినతి పత్రం ఇస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదు’ అన్నారు.

అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలన్నారు. అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీమ్‌ ‌కోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చిందనీ గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అనుసరించడం మాట అటుంచితే, రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుందన్నారు. చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్న వారిపైన రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయనీ, ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సర్కారుదేననీ, కాదంటే, హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదనీ విజయశాంతి హెచ్చరించారు.

Leave a Reply