Take a fresh look at your lifestyle.

కొరోనా సంక్షోభం లో కేసీఆర్‌ ‌రాజకీయాలు

“ప్రతి రాజకీయ నాయకుడు వందలాది ఎకరాలు ఎక్కడ నుండి సంపాదించారు..! వారు దోచిన ప్రతి సెంటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచే దైర్యం ప్రభుత్వం చేస్తేనే పాలకుల మీద ప్రజలకు విశ్వాసం కల్గుతుంది. తెలంగాణ ఉద్యమం నడిచిందే
‘‘నీళ్లు – నిధులు – నియామకాలు ‘‘ అంశాల ప్రాతిపదికన కదా!. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అక్రమంగా సంపాదించిన భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద ఉన్నది..”

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్నది. ప్రభుత్వ దావాఖానలలో వైద్య సదుపాయాలు అందక అనేక మంది ప్రజలు మృతి చెందుతున్న పరిస్థితులు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొరోనా కష్ట కాలంలో ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌లో పడకలు  ఉన్నా లక్షల రూపాయలు వాళ్ళ నెత్తిన కొడితె తప్ప అందులో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనా నియంత్రణ చర్యల్లో పూర్తిగా విఫలమవుతున్నాయని చెప్పటానికి ప్రస్తుత పరిస్థితులు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందిన ప్రభుత్వ వైఫల్యాలను సభ్య సమాజమంతా నిలదీస్తుంది. ప్రభుత్వంపైన ప్రజలకున్న వ్యతిరేకత బలపడకుండ, కనిపించకుండా ఉండటానికి సమయానుకూలంగా ప్రజల ఆలోచనల్ని ప్రక్కదోవ పట్టించటానికి కొత్త చర్చను తెరపైకి  తీసుకురావడంలో కేసీఆర్‌ ‌దిట్ట అని వివిధ సందర్భాల్లో రుజువైంది.

రాష్ట్రంలో పలు చోట్ల ఎన్నికల పోలింగ్‌ ‌ప్రక్రియ ముగిసిందనే సమాచారం అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి డైరెక్షన్‌ ‌లో తన అనుకూల న్యూస్‌ ‌మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మీద భూ ఆక్రమణ ఆరోపణలు ప్రసారమయ్యాయి. ఇలా మొదలైన ఈటల ఎపిసోడ్‌ ‌ఫలితంగా 48 గంటల్లో ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా గవర్నర్‌ ‌మంత్రి ఈటల రాజేందర్‌ ‌ను కేబినెట్‌ ‌నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. అవి ఆరోపణలా? నిరూపణలా? అనే విషయం ప్రజలు సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంతా నిజంగా అవినీతిని సహించని విధంగా పారదర్శకంగా జరుగుతుందా!? ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి మీద విచారణ జరిపి చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది. కానీ కే.సి.ఆర్‌. ‌పాలనలో ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలే  జనవాడ భూ వివాదం, మంత్రి మల్లారెడ్డి, మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి,  గొంగడి సునీత మహేందర్‌ ‌రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హుజర్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి 421 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు, మంత్రి శ్రీనివాసు గౌడ్‌ , ‌డ్రగ్స్ ‌వ్యవహారాల పైన ఆరోపణలు, ఇలా గులాబీ నేతల పైన బహిరంగంగా ఆరోపణలు వచ్చాయి.

ఇలా పదుల సంఖ్యలో  పెద్ద ఎత్తున్న ఆరోపణలు ఉన్న నాయకులు గులాబీ  దళంలో ఉన్నారు. ఎందుకు వీరందరి మీద 48 గంటల్లో చర్యలు లేవు? ఈటల రాజేందర్‌ ‌మీద మాత్రమే చర్యలు ఎందుకు తీసుకున్నారు. అంటే చాలా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకు కాస్తో కూస్తో అందుబాటులో ఉండే వ్యక్తి ఈటల. ఇది మాత్రమే కాదు, పాలక పార్టీలో ఉన్న అంతర్గత ఆధిపత్యాన్ని ధిక్కరించిన వారిలో ముందున్నవాడు. అందుకే ఈటల రాజేందర్‌ ‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు అనేది జగమెరిగిన సత్యం.

కే.సి.ఆర్‌. ‌వేసిన ఒక పథకంలో తనకు రెండు  పరిష్కారాలు లభించాయి. అవి:

1) ధిక్కార స్వరాన్ని తొలగించటం 2) ప్రజల్ని కరోనా సంక్షోభం గురించి ప్రశ్నించకుండా వారి ఆలోచనలు రాజకీయ పరిస్థితుల మీద కేంద్రకరించేలా చేయటం. కేవలం 48 గంటల్లోనే శరవేగంగా జరిగిన ఆరోపణలు, నిరూపణలు(నిజానికి ఇంకా పూర్తి నిరూపణ జరగలేదు), నియంత్రణ ప్రక్రియలు చూస్తుంటే భాగానే అనిపిస్తుంది. కానీ ఇలాంటి చర్యలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ప్రజా ప్రతినిధి మీద తీసుకుంటే నిజంగా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విషయమే. బహుశా వాళ్ళందరూ దోచిన సొమ్మును వెనక్కి తీసుకొస్తే ప్రజల పేదరికం పోయేలా ప్రణాళికలు చేయొచ్చు. కానీ కే. సి.ఆర్‌. ఆ ‌పని చేయడు, చేయలేడు. అవినీతి ముఠాకు నాయకుడు ఎవరు??  ఇలాంటి చర్యలు ప్రజలకు మేలు చేసినప్పటికి చలామణి అవుతున్న భూ బకాసూరుల పైన ఆ వేటు లేదనే పెద్ద చర్చ తెలంగాణలో నడుస్తోంది.

ఉద్యమ నాయకుడు, 20 సంవత్సరాలు ప్రజల కోసం  మచ్చ లేని మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడి పైన వేటు  వేయడమనేది ఈటల అభిమానులను, తెలంగాణ సమాజాన్ని గందరగోళానికి గురిచేసే అంశాలే. ఇప్పుడు ఈటల రాజేందర్‌ ‌విసిరిన విచారణ సవాళ్ళను కే.సి.ఆర్‌. ‌స్వీకరించి నిరూపించగలరా? ప్రతి రాజకీయ నాయకులు వందలాది ఎకరాలు ఎక్కడ నుండి సంపాదించారు. వారు దోచిన ప్రతి సెంటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచే దైర్యం ప్రభుత్వం చేస్తేనే పాలకుల మీద ప్రజలకు విశ్వాసం కల్గుతుంది. తెలంగాణ ఉద్యమం నడిచిందే ‘‘నీళ్లు  – నిధులు  – నియామకాలు ‘‘ అంశాల ప్రాతపదికన కదా!. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అక్రమంగా సంపాదించిన భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే భాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద ఉన్నది. పోడు భూముల సమస్య అలాగే ఉండిపోయింది. ఉద్యోగాలు లేక ప్రాణాలు తీసుకుంటున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నీరు లేక నెర్రెలు బాసిన భూమికి సాగు నీరు కావాలని అడిగే వాడు కరువు కావటం వెనుక తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా నొక్కి వేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

20 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ఆరుసార్లు(ఉప ఎన్నికల తో కలిపి) ఎమ్మెల్యేగా గెలిచినవాడు. . అసెంబ్లీలో వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ‘‘ రాజేంద్ర ‘‘తల యడా పెట్టుకుంటావు  అంటూ కించపరుస్తూ మాట్లాడిన మాటలు ఈటలను ప్రత్యేక తెలంగాణ పోరాటం వైపు మళ్ళించాయే తప్ప కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరి మంచి పదవులు అనుభవించాలనే ఆలోచనకు దారితీయలేదు. ఉన్న మంత్రుల్లో కాస్తో కూస్తో  నిజాయితీగా, నిస్వార్ధంగా పనిచేసే నాయకుడుగా గుర్తింపు పొందినాడు. ప్రజల మన్ననలు పొందిన వాడుగా పేరు తెచ్చుకున్న మంత్రి ఈటల. 2018 ఎన్నికల్లో గెలిచినాక  మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్థంలో ఉన్నప్పుడు  అధినేత నేరుగా’’ ఫోన్‌ ‌చేయలేదని’’  అప్పట్లో  ప్రసారసాధనాలలో జోరుగా చర్చ సాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యువనేత కారులో ఎక్కించుకొని ప్రగతిభవన్‌ ‌తీసుకుపోయి మంతనాలు జరిపినట్లు వచ్చిన కథనాలపై స్పష్టత లేనే లేదు. ఓనర్లు మేమే అంటూ చేసిన కామెంట్లు తెలంగాణ సమాజం సమర్ధించిందనే చెప్పొచ్చు. ఉద్యమాన్ని నమ్ముకుని టిఆర్‌ఎస్‌ ‌జెండా మోసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తపించిన ఓబీసీ సామాజిక ఉద్యమ నేతగా పేరుగాంచిన వ్యక్తి ఈటల.

తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ద్రోహులను తమ పార్టీలో చేర్చుకుని  మంత్రులను చేసిన ఘనత ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది.  ఎక్కడి తుమ్మల? ఎక్కడి ఎర్రబెల్లి? ఎక్కడి  తలసాని? ఎక్కడి కడియం? ఎక్కడి దానం నాగేందర్‌? ‌తెలంగాణలో పాలన ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నదని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల చైతన్యం ముందు ఏ రాజకీయ ఎత్తుగడలు, మోసాలు అనేవి ఎల్లకాలం సాగవు. ప్రజలు సరైన సమయంలో సరైన పరిష్కారం చూపుతారు, దోపిడీ దొంగలను తరిమికొట్టి తెలంగాణ చైతన్యాన్ని నిలుపుకుంటారనే  శాస్త్రీయ సత్యాన్ని ఏ పాలకుడు ఆపలెడనే విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచింది!
   –  వి.గోపినాథ్‌, 9666800045.

Leave a Reply